ఏపీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ వెల్లడించారు. విశాఖలో కాంగ్రెస్ పార్టీ మూడో జోనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ఏపీలో నాలుగు ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో కర్నాటక సీఎంతో పాటు తెలంగాణ సీఎం కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్‌ను బలహీనపరిచాయన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలపడడానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ప్రత్యేక హోదా గురించి అడగకుండానే ఎన్డీఏలోకి చంద్రబాబు వెళ్తారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఏ ఒక్క ఏపీ కాంగ్రెస్ నాయకుడు వెళ్లని సంగతి తెలిసిందే. ఒకవేళ ఏపీ కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వస్తే, దాన్ని సాకుగా చూపి బీఆర్ఎస్ మరోసారి రాజకీయంగా లబ్ధి పొందుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ భయపడింది.
2018 నాటి చేదు అనుభవాలు కాంగ్రెస్‌ను వెంటాడుతున్నాయి. 2018లో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. మళ్లీ చంద్రబాబు పాలన మనకు కావాలా? అని ప్రాంతీయ సెంటిమెంట్‌ను చంద్రబాబు రగిల్చి రాజకీయంగా సొమ్ము చేసుకున్నారు. చంద్రబాబు ప్రచారంతోనే తాము పుట్టి మునిగామని అప్పట్లో కాంగ్రెస్ విశ్లేషించుకుంది. అందుకే ఏపీ నాయకులను అక్కడి జాతీయ పార్టీలు పూర్తిగా దూరం పెడతాయి.
కానీ తెలంగాణ నాయకులు మాత్రం ధైర్యంగా ఏపీలో ప్రచారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేసేందుకు వస్తున్నారనే చర్చకు తెరలేచింది. ఏపీ ఎన్నికల ప్రచారానికి వచ్చి, తన గురువు చంద్రబాబుపై విమర్శలు చేస్తారా? చేయరా? అనేది చూడాలి.