నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ టికెట్‌పై మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి కన్నేశారు. టికెట్ హామీతో టీడీపీ కండువా కప్పుకోడానికి గంగుల ప్రతాప్‌రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. మాజీ ఎంపీ అయిన గంగుల ప్రతాప్‌రెడ్డిని టీడీపీలో చేర్పించేందుకు కడప జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆళ్లగడ్డ టికెట్‌ను గంగులకు ఇప్పించేందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పావులు కదిపారు.
ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా నివేదికలు వుండడంతో చంద్రబాబునాయుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తమ దగ్గరి బంధువైన గంగుల అభ్యర్థిత్వం గురించి వివరించినట్టు తెలిసింది. గంగుల ప్రతాప్‌రెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తారని చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ముందుగా గంగుల ప్రతాప్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చింతకుంట శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ వాసు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే సీపీ తిమ్మారెడ్డి కుటుంబ సభ్యుడే వాసు. ఈయన చాలా కాలంగా గంగుల కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు. గంగుల ప్రతాప్‌రెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడు బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే.
అయితే తన కుటుంబం నుంచి రాజకీయ వారసత్వాన్ని గంగుల ప్రతాప్‌రెడ్డి కోరుకుంటున్నారు. తనకు , లేదా తన కుమారుడికి ఆళ్లగడ్డ టికెట్‌ను ప్రతాప్‌రెడ్డి ఆశిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అల్లుడే ప్రతాప్‌రెడ్డి కుమారుడు. అల్లుడిని ఎమ్మెల్యే చేసుకోడానికి వీరశివారెడ్డి, ఆయన తమ్ముడి కుమారుడైన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఆళ్లగడ్డలో టీడీపీ బలహీనంగా వుండడంతో పొత్తులో భాగంగా జనసేన లేదా బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గంగుల ప్రతాప్‌రెడ్డి రూపంలో టీడీపీ బలంగా కనిపిస్తోందనే చర్చకు తెరలేచింది. ఇదే జరిగితే అఖిలప్రియ పరిస్థితి ఏంటనేది ప్రశ్న.