బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విశ్రాంతిలో వున్నారు. అయితే కృష్ణా జలాలపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్ హాజరయ్యారు.
తనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ తెలంగాణకు సాగునీటి పంపకాల్లో అన్యాయం జరుగుతుండడంతో సభకు వచ్చానని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు నల్గొండ సభకు వెళ్లిన కేసీఆర్, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం ఏంటని సీఎం రేవంత్‌రెడ్డి మొదలుకుని కాంగ్రెస్ నేతలంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ నుంచి కూడా రావడం విశేషం.
సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడం ఏంటని ఆయన నిలదీశారు.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బీజేపీ దూరంగా వుండడాన్ని ఆయన తప్పు పట్టారు. మేడిగుడ్డ బ్యారేజీలో అవినీతిపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోందని, ఇదంతా కుట్రగా ఆయన అభివర్ణించారు. తద్వారా సీబీఐ విచారణను మేనేజ్ చేసి కేసీఆర్‌ను కాపాడుకోవచ్చనేది బీజేపీ ఎత్తుగడ అని ఆయన విమర్శించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ అవినీతిపై విచారణ జరిపి, బీఆర్ఎస్ నేతలను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి టీడీపీ, వైసీపీ మద్దతు ఇస్తున్నాయని ఆయన విమర్శించారు.