మంత్రి గుమ్మనూరు జయరాం ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కింది. కొంత మంది మంత్రులను మార్చినప్పటికీ, సామాజిక సమీకరణల్లో భాగంగా జయరాంను మాత్రమే కొనసాగించారు. అయితే సర్వే నివేదికలు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ఆలూరు టికెట్ ఇవ్వడంపై జగన్ వెనుకంజ వేశారు.
మొహమాటం లేకుండా ఆలూరు టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. అలాగని గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టలేదు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ ఎంపీగా పోటీ చేయడానికి జయరాం ససేమిరా అన్నారు. సీఎం జగన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తనదైన చిల్లర రాజకీయాన్ని ఆయన ప్రయోగించారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించి, మీరు చెప్పినట్టే నడుచుకుంటానని, ఏం చేయాలో తెలియజేయాలని అభిప్రాయాన్ని అడిగారు.
ఆలూరులోనే పోటీ చేయాలంటూ తన వాళ్లతో మీడియాకు చెప్పించి, జగన్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. అనుచరులు వద్దని చెబితే ఎంపీగా పోటీ చేయనని కూడా ప్రకటించి వైసీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. కొన్ని రోజులు వైసీపీ పెద్దలు, పిల్లలకు అందుబాటులో లేకుండా పోయారు. ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీల్లో టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే వర్కౌట్ కాలేదు.
దీంతో తనపై ఏ స్థాయిలో చెడ్డపేరు వుందో ఆయన గ్రహించారు. ఇట్లే చేస్తే ఏమీ లేకుండా పోతుందని గుమ్మనూరు భయపడ్డారు. కర్నూలు ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థిని నిలిపే ఆలోచనలో వైసీపీ వుందని తెలుసుకుని మంత్రి జయరాం మళ్లీ వైసీపీ అధిష్టానానికి టచ్‌లోకి వెళ్లారు. మూడు రోజుల క్రితం సీఎం జగన్‌ను సీఎంవోలో కలిశారు. సీఎం ఏం చెప్పారో వివరాలు తెలియదు. ఇప్పుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సీఎంను గుమ్మనూరు జయరాం కలుసుకున్నారు.
మళ్లీ జగన్ గుడ్ లుక్స్‌లో పడేందుకే మంత్రి జయరాం ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కర్నూలు ఎంపీ టికెట్ ఉంచుతారా? లేక దాన్ని కూడా పీకి పడేస్తారా? అనేది తేలాల్సి వుంది. అప్పటి వరకూ గుమ్మనూరుకు ఇబ్బందులు తప్పేలా లేవు. స్వయంకృతాపరాధం అంటే ఇదేనేమో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.