కమలం పార్టీ పంచన అలా చేరిండో లేదో.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవన్ కు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసింది! మరి ఈ అశోక్ చవన్ ఎవరో.. అని మరీ అరాలు తీయనక్కర్లేదు! ఒకానొక దశలో కమలం పార్టీ అ చవనుడిని ఉతికి ఆరేసేది! అప్పట్లో ప్రొద్దున పేపర్ చూస్తే.. ఆదర్శ్ హౌసింగ్ స్కామ్, అశోక్ చవన్ అనే పేర్లు వినిపించేవి!
2జీ స్కామ్ వార్తల్లో ఊపేస్తున్న దశలోనే మహారాష్ట్రలో చోటు చేసుకుందన్న ఈ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ కూడా పేలింది! దీనిపై లెక్కకు మిక్కిలి వార్తలు వచ్చాయి. కొందరు కవితలు రాశారు, మరణించిన సైనికులకు కుటుంబాలకు చెందాల్సిన భూములను కాజేసే స్కామ్ ఇదని అప్పట్లో దుమ్ముదుమారం రేగింది. ఆ భూమి డిఫెన్స్ విభాగానికి చెందడంతో ఆ స్కామ్ వార్తలకు బ్రహ్మాండమైన ప్రచారం లభించింది.
కాంగ్రెస్ దురదృష్టం ఏమిటంటే ఆ స్కామ్ లకు సంబంధించిన గుట్లు దాని హయాంలోనే బయట పడ్డాయి. బాధ్యులపై కాంగ్రెస్ తక్షణం కూడా కొన్ని చర్యలను తీసుకుంది. 2జీ స్కామ్ లో కనిమొళిని జైలుకు పంపింది, కల్మాడీకి జైల్లోనే పిచ్చి పట్టింది, ఆదర్శ్ హౌసింగ్ సొసైట్ స్కామ్ తో అశోక్ చవాన్ తో రాజీనామా చేయించింది! ఇలాంటి స్కామ్ ల వార్తలతో దేశం ఉక్కిరిబిక్కిరి అయిపోయి కాంగ్రెస్ ను చిత్తు చేసింది!
ఆ తర్వాత బీజేపీ గద్దెనెక్కాకా.. 2జీ స్కామ్ కేసు పూర్తిగా కొట్టివేయబడింది! తను సంవత్సరాల పాటు వేచి చూసినా.. ఎవ్వరూ సాక్షాలు అంటూ చిన్న కాగితం ముక్క కూడా తీసుకొచ్చి ఇవ్వలేదంటూ 2 జీ స్కామ్ ను విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు! ఇక ఇప్పుడు.. అప్పట్లో బీజేపీ భావోద్వేగాలు పండించిన ఆదర్శ్ స్కామ్ కు బాధ్యుడిగా మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన అశోక్ చవాన్ కు కమలం పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేస్తోంది. అది కూడా తమతో జట్టు కట్టిన కొన్ని గంటల్లోనే!
కమలం పార్టీలో చేరితో పుణీతులు అయిపోతారనడంలో ఎలాంటి వ్యంగ్యం లేదు సుమా! అదేంటంటే.. చవన్ తో చేరికతో బీజేపీ మహారాష్ట్రకు తిరుగులేదట! నేచురల్ కరప్టెడ్ పార్టీ.. ఎన్సీపీ అంటూ దాంట్లో మెజారిటీ మంది నేతలను తమకు దోస్తులుగా చేసుకున్నారు, ఇప్పుడు మహా ఖతర్నాక్ లుగా కనిపించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు బీజేపీలోకి చేరి రాత్రికి రాత్రి పదవులు పొందుతున్నారు! ఇదే కదా.. దేశాన్ని మార్చేయడం అంటే!