కీలక స్థానంలో ఉన్న నాయకులు ఏమి మాట్లాడుతారు అన్నది జనాలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. నారా లోకేష్ భాష విషయంలోనే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. ఆయన జనాలకు హుషార్ తేవాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ తాను వెళ్ళిన ప్రతీ చోట్ల ఆయా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త పేర్లు పెడుతూ అందులో ఆనందం పొందుతున్నారు.
అయితే ఆయన పెడుతున్న పేర్లు అభ్యంతరంగా ఉంటున్నాయనే అంటున్నారు మంత్రి సీదరి అప్పలరాజుని పట్టుకుని కొండల రాజు అని విమర్శించారు. ఆయన కొండలు మింగేసే రాజు అని లోకేష్ విమర్శ అన్న మాట. దాదాపు ఏడు పదుల ఏజ్ లో ఉన్నారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాంని పట్టుకుని డమాం బుస్ ఎమ్మెల్యే అని లోకేష్ అనేశారు. లోకేష్ పుట్టేనాటికి తమ్మినేని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వయసుకు సీనియారిటీకి గౌరవం ఇవ్వాలి కదా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఆయన అంతటితో ఆగలేదు ముఖ్యమంత్రి జగన్ ని పట్టుకుని ఫిట్టింగ్ కటింగ్ అంటూ ఏవేవో మాట్లాడారు. ప్రజల రక్తం రోజూ జగన్ తాగుతారు అని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. విజయనగరం జిల్లాలోని కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని టిక్ టాక్ అంటీ అని లోకేష్ అనడం మీద విమర్శలు వస్తున్నాయి. ఆమె టిక్ టాక్ ఆంటీగా బిజీ అయ్యారని సెటైర్లు వేశారు.
రాజకీయాలలో విమర్శలు చేయకూడదని ఎవరూ అనరు. కానీ అవి మరీ దారుణంగా వ్యక్తిగతంగా ఉండడం మీదనే వైసీపీ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. లోకేష్ అయితే జనాలకు ఇవే నచ్చుతాయని మాట్లాడుతున్నారా అని అంటున్నారు. లోకేష్ తెలుగు పదాలు సరిగ్గా పలకలేక అవస్థలు పడుతున్న నేపధ్యం కూడా ఇదే సభలలో కనిపిస్తోంది.
శంఖారావం అని పలకకుండా సంకారావం అనడంతో ఆయన మీద సోషల్ మీడియాలో ఒక వైపు ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. మా తాత దేవుడు, మా నాన్న రాముడు నేను మూర్ఖుడిని అని లోకేష్ చెప్పిన డైలాగులు ఆయనకే చుట్టుకుంటున్నాయని తమ్ముళ్ళు గోల పెడుతున్నారు. వైసీపీ వారికి ఇది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి అస్త్రంగా మారిపోయింది అని అంటున్నారు.