ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుకు టీడీపీ మంత్రివర్గంలో చోటు దక్కింది. అంతే కాదు పవర్ ఫుల్ శాఖ కూడా లభించింది. అదే హోం శాఖ. అచ్చెన్న ఎంతగానో మోజు పడిన శాఖ. ఇంతకీ ఇదేమిటి అనుకుంటున్నారా. ఆలూ లేదు చూలూ లేదు ఏంటిది అని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టం. రాజకీయాల్లో నేతలకు తమ మీద కంటే గెలుపు మీద విశ్వాసం ఎక్కువ. అలా ధీమాతో తెలుగుదేశం గెలుపు ఖాయం అనుకుంటూ టీడీపీ చినబాబు లోకేష్ బాబు నోటి వెంట వచ్చిన మాటలు ఇవి.
ఆయన శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనిలో పనిగా తమ పార్టీ సీనియర్లకు మంత్రివర్గంలో శాఖలు కూడా ఇచ్చేస్తున్నారు. అచ్చెన్నాయుడు హోం మినిస్టర్ అన్నది చినబాబే.
వైసీపీ పాలనలో ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని టీడీపీ వచ్చి అచ్చెన్న హోం మంత్రి అయితేనే తప్ప ఈ పరిస్థితులు చక్కబడవు అంటూ లోకేష్ బాబు చెబుతున్నారు. ఎన్నికలదేముంది లాంచనం అంటున్నారు లోకేష్ సహా టీడీపీ నేతలు. ఇలా ఎన్నికలు పెట్టడమేంటి టీడీపీ అధికారంలోకి వచ్చినట్లే అని జోస్యం చెప్పేస్తున్నారు.
లోకేష్ శ్రీకాకుళం జిల్లా టూర్ లో బాబాయ్ అచ్చెన్నను హోం మినిస్టర్ చేశారు. అబ్బాయ్ శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడుని కేంద్ర మంత్రినీ చేశారు. హ్యాట్రిక్ ఎంపీ అంటూ లోకేష్ ముందే అక్కడ విజయం ప్రకటించేశారు. ఈసారి ఆయన ఉన్నత పదవులు అందుకుంటారు అంటూ కేంద్ర మంత్రి వస్తుందన్నట్లుగా హింట్ ఇచ్చేశారు. లోకేష్ జిల్లా పర్యటనలో కింజరాపు కుటుంబానికి అలా పెద్ద పీట వేయడం కనిపీంచింది.
అచ్చెన్నకు హోం మంత్రి బాగానే ఉన్నా అదే పదవి కోసం ఉత్తరాంధ్రాకే చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఆశలు పెట్టుకున్నారు. నాకు హోం మంత్రి ఈసారి ఇస్తే చాలు మొత్తం లా అండ్ ఆర్డర్ లైన్ లో పెడతాను అని ఆయన తరచూ చెబుతూ వస్తున్నారు. ఆయన సంగతేంటో ఆయనకు ఇచ్చే శాఖ ఏమిటో విశాఖ జిల్లా పర్యటనలో చినబాబు చెబుతారు కామోసు.