ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీమ్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. సుమారు 25 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఏడు నియోజక వర్గాల్లో రాజకీయ వాతావరణంపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఇటు ప్రజలకు, అటు నాయకులకు ఏం కావాలనే అంశంపై టీమ్ సభ్యులు ఆరా తీస్తున్నారని సమాచారం.
ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాగుంట స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తున్న జగన్‌కు, వెతుకుతున్న తీగ కాలికి తగిలిన చందంగా, తన పక్కనే వున్న చెవిరెడ్డి కనిపించారు. అనుకున్నది సాధించడానికి ఏం చేయాలో చెవిరెడ్డికి బాగా తెలుసు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి బలమైన నాయకుడు ఎలా అయ్యాడు.. ఆయన ఆర్థికంగా సంపన్నుడు కావడమే.
ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఆ కోవలో చేరారు. దీంతో మాగుంట లేకపోతే ఏమవుతుందో అనే భయం చెవిరెడ్డిని చూసిన తర్వాత జగన్‌లో పోయింది. అయితే మాగుంటకే ఎలాగైనా సీటు ఇప్పించుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. బాలినేని ప్రయత్నాలేవీ ఫలించలేదు. బాలినేని ఆశీస్సులను చెవిరెడ్డి కోరారు. జగన్ నిర్ణయమే ఫైనల్ కావడంతో బాలినేని కూడా అంగీకరించక తప్పని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఒంగోలులో విజయం సాధించేందుకు చెవిరెడ్డి చాప కింద నీరులా తన పనుల్ని చక్కదిద్దుకుంటున్నారు. తన టీమ్‌ను ఒంగోలు పార్లమెంట్ పరిధిలో దించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలానికి వెళ్లి… ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతల్ని గుర్తించే పనిలో పడ్డారు. వైసీపీ నేతల్లో అసంతృప్తుల్ని గుర్తిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో చెవిరెడ్డికి చేయడానికి ఏం కావాలో తెలుసుకుంటున్నారు. చోటామోటా నాయకుల కోరికలను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మాగుంట కంటే ఎక్కువ మెజార్టీ సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చంద్రగిరిలో గల్లా అరుణను ఓడించడంతో పాటు రెండోసారి కూడా 2019లో విజయం సాధించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించారో, వాటినే ఒంగోలులో అమలు చేసేందుకు చెవిరెడ్డి చకచకా పావులు కదుపుతున్నారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్‌రెడ్డిని బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. ఒంగోలుకు చెవిరెడ్డి స్థానికేతరుడనే ఏకైక నెగెటివ్ తప్ప, మిగిలినవన్నీ ఏ రకంగా చూసినా సానుకూలమే.