టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదుర్చకున్న కొత్తలో ఉన్న ప్రేమాభిమానులు ఇప్పుడు కనిపించడం లేదు. క్రమంగా ఆ రెండు పార్టీల మధ్య పరస్పరం మోజు తగ్గుతోంది. పొత్తు కుదిరిన సందర్భంలో జనసేన వల్ల తమకు రాజకీయంగా లాభమని టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరపడ్డారు. కాలం గడిచే కొద్ది లాభం కంటే నష్టమే ఎక్కువనే వాస్తవాన్ని టీడీపీ నేతలు గ్రహించారు. దీంతో జనసేనకు దూరంగా వుండడం మొదలు పెట్టారు.
చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద నాయకుల స్థాయిలో చూస్తే అంతా బాగుందన్నట్టు కనిపిస్తోంది. కానీ సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చే సరికి… అలకలు, ఎడమొహం, మనస్తాపాలు కనిపిస్తున్నాయి. టీడీపీ పల్లకీ మోయడానికి మాత్రమే పనికొస్తుందనుకుంటే జనసేనను టీడీపీ నేతలు ప్రేమించేవాళ్లు. అయితే సీట్లలో వాటా అడుగుతుండడంతో వ్యవహారం బెడిసి కొడుతోంది.
ముఖ్యంగా పొత్తు సీన్లోకి బీజేపీ ప్రవేశించడంతో ఏమవుతున్నదో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. బాబుతో పవన్‌కల్యాణ్ మాత్రమే పొత్తుపై చర్చలు జరుపుతున్నప్పుడు టీడీపీ శ్రేణుల్లో సంతోషం కనిపించింది. చంద్రబాబు ఏదో రకంగా మాయ చేసి 10 లేదా 20 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లతో పవన్‌ను ఒప్పిస్తారనే నమ్మకం టీడీపీ నేతల్లో వుండేది. కానీ ఇప్పుడంతా రివర్స్ అయ్యింది.
ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాతో చంద్రబాబు చర్చించి రావడం, ఆ తర్వాత నోరు ఎత్తకపోవడంతో అసలేం జరుగుతున్నదో అంతు చిక్కడం లేదు. మరీ ముఖ్యంగా జనసేన సీట్లపై అనూహ్యంగా రోజురోజుకూ సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలు తమ సీటుకు ఎక్కడ ఎసరు తెస్తాయో అని టీడీపీ నేతలు భయపడుతున్నారు. దీంతో జనసేనతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకెళుతున్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నా, కొన్ని నియోజక వర్గాల్లో మొక్కుబడిగా సాగాయి. మరికొన్ని చోట్ల ఆ రెండు పార్టీల నేతలు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు.
అందుకే టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాలకు ఫుల్స్టాప్ పడింది. ఏదైతే అది జరుగుతుందిలే అనే ఆలోచనతో ఇరుపార్టీల నేతలు క్షేత్రస్థాయిలో పని చేసుకెళుతున్నారు. పొత్తు వుంటుందని చెబుతూనే, ఎవరికి వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఏదైనా వుంటే ఇరుపార్టీల అగ్రనేతలు చూసుకుంటారని చెబుతున్నారు. అభ్యర్థులతో పాటు నియోజకవర్గాల ప్రకటన వస్తే… రెండుపార్టీల్లో తిరుగుబాటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. దాన్ని ఎలా డీల్ చేయడం పవన్, చంద్రబాబుకు సవాలే.