జనసేనాని పవన్‌కల్యాణ్‌కు పర్యటనలకంటే పబ్లిసిటే ప్రధానమైనట్టుంది. చాలా రోజుల తర్వాత ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో 14 న భీమవరంలో పర్యటిస్తారని జనసేన ప్రకటించింది. అయితే ఆయన హెలీకాప్టర్ దిగడానికి ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి నిరాకరించారు.
దీంతో జనసేన నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పవన్ పర్యటనకు భయపడి జగన్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసిందట. సిద్ధమంటూ ప్రకటించిన జగన్, మరెందుకని పవన్ పర్యటనలకు అడ్డంకి సృష్టిస్తున్నారని జనసేన నుంచి నిలదీత ఎదురవుతోంది. భీమవరంలో పవన్ పర్యటన వెనుక ప్రభుత్వ కుట్ర వుంటే ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే.
కానీ పవన్‌కల్యాణ్ నిజంగా జనంలోకి వెళ్లాలని అనుకుంటే, ఈ అడ్డంకి పెద్ద సమస్య కాదు. విజయవాడ నుంచి భీమవరానికి కారులో వెళితే అడ్డు చెప్పేదెవరు? నిజంగా భీమవరం ప్రజానీకాన్ని కలవాలని, వారి సమస్యలను తెలుసుకోవాలనే సంకల్పం బలంగా వుండి వుంటే పర్యటన రద్దు అయ్యేది కాదు. అనుమతుల సాకుతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి, చల్లగా ఇంట్లో పడుకోవాలని పవన్ భావిస్తున్నట్టున్నారనే ఎదురు దాడి మొదలైంది.
భీమవరంలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అందుకే ఆ నియోజకవర్గంపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే తన పోటీపై ముందే ప్రకటిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేస్తారో అనే భయం పవన్‌ను వెంటాడుతోంది. అందుకే పోటీపై పవన్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలా ప్రత్యర్థులు ఏం చేస్తారో అని భయపడుతూ నియోజకవర్గాన్నే దాస్తే, రానున్న కాలంలో జనసేనాని ఎలా ఎదుర్కొంటారో ఆయనకే తెలియాలి.