మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం పలు దఫాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించింది. ఎన్నికల తేదీలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16 లేదా 18తేదీలను ప్రభుత్వం సూచించినట్టు సమాచారం. ఈ తేదీలే కాకుండా ఉగాదికి ముందు నిర్వహించకోవచ్చని ప్రభుత్వ యంత్రాంగం సూచించినట్టు తెలిసింది.
ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ పండుగ తెలుగు వారికి చాలా ముఖ్యమైంది. జనం ఉగాది మూడ్లో ఉన్నప్పుడు కాకుండా, దానికి ముందు లేదా తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలు జరగాల్సి వుంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికారుల బదిలీలు, పనులకు సంబంధించి కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. వీలైన మేరకు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అధికార పార్టీ నేతలు పరుగులు తీస్తున్నారు.
ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి సిఫార్సులు చేయించుకోవడంలో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. అలాగే పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు చక్కర్లు కొడుతున్నారు. ఎవరి నోట విన్నా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందనేదే.