విశాఖ భూ కబ్జాలలో టీడీపీ సరికొత్త రికార్డుని సృష్టించిందని వైసీపీ అంటోంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములు వందల వేల ఎకరాలు అని చెబుతోంది. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది ఎకరాలను కబ్జా చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు సూక్తిముక్తావళి వల్లిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
విశాఖలో భూకబ్జాలు టీడీపీ నేతలు చేస్తే వారి చెర నుంచి 430 ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కాపాడామని ఆ పార్టీ ఎమ్మెల్సీవరుదు కళ్యాణి అన్నారు. అప్పట్లో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ భూఅక్రమాలు చేస్తే టీడీపీ అనుకూల మీడియా ఒక్క రాత కూడా రాయలేదని దుయ్యబెట్టారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖ ప్రజలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ టీడీపీ నేతలు తమ భూములను ఆక్రమించారంటూ ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ఫిర్యాదులు అయితే ఏకంగా 2,500 పై దాటి ఉనాయని ఆమె లెక్క చెప్పారు. ఇన్నేసి ఫిర్యాదులు గత ప్రభుత్వ హయాంలో ఒక్క విశాఖ ప్రాంతం నుంచే పోలీసుశాఖకు అందాయంటే టీడీపీ నేతల భూకబ్జాల రికార్డు ఏంటో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
ఆ ప్రభుత్వ భూములలో చాలా వరకూ వైసీపీ ప్రభుత్వం కాపాడిందని ఆమె అన్నారు. నిజంగా వైసీపీ నేతలు విశాఖలో భూములను ఆక్రమిస్తే దానికి ఆధారాలు ఉంటే కనుక విశాఖ నగరంలో ఎక్కడైనా తమ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదు ఇప్పుడు కనిపించిందా అని ఆమె ప్రశ్నించారు. లేదా ఎవరైనా తమ భూమిని కబ్జా చేశారంటూ మీడియా ముందుకొచ్చి చెప్పారా అని నిలదీశారు.
ఒక వేళ విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు ఆక్రమణలు జరిగినట్లు నిజంగా టీడీపీ నేతలు కానీ వారి అనుకూల మీడియా కానీ నమ్మితే కోర్టులను ఆశ్రయించు వచ్చు కదా అని ఆమె లాజిక్ పాయింటే తీశారు. విశాఖ అభివృద్ధిని ఓర్వలేక పచ్చ మీడియా తెగబడి రాతలు రాస్తోందని అయినా విశాఖ ప్రజలు నమ్మరని ఆమె స్పష్టం చేశారు.