నిందలు వేయడం చాలా సులభం. నారా వారి చినబాబు ప్రస్తుతం చేస్తున్నది కూడా అదే. ఎడాపెడా జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద విమర్శలతో చెలరేగిపోవడం మాత్రమే ఆయన లక్ష్యం. పాడిందే పాడరా పాచిపళ్ల కచేరీ అన్న సామెత చందంగా ఆ విమర్శల్లో కొత్తపాయింట్ ఏమీ ఉండదు. సంవత్సరానికి పైగా మైకు కనిపిస్తే చాలు.. జగన్ మీద ఆరోపిస్తున్నవే.
అయితే అలా పాచిపోయిన విమర్శలు చేయడానికి కొత్త కొత్త పేర్లతో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు శంఖారావం సభల్లో కూడా లోకేష్ అరిగిపోయిన రికార్డులనే వినిపిస్తున్నారు. వాటన్నింటి సంగతి అనవసరం అయినా.. రెండు అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అవే ప్రత్యేకహోదా, సీపీఎస్ రద్దు.
పాతిక మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా తీసుకువస్తానని జగన్ చెప్పిన మాటను లోకేష్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏ వ్యూహంతో ఆ రోజు ఆ మాట చెప్పానో జగన్ శాసనసభలోనే చాలా విపులంగా వివరించారు. తమ పార్టీ మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే.. అప్పుడు హోదా సాధించగలం అనుకున్నాం అని.. కానీ అలా జరగలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడైనా సరే.. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి కూడా పూర్లి మెజారిటీ రాకూడదని దేవుడిని కోరుకుంటున్నట్టు కూడా చెప్పారు.
అయినా సరే.. ప్రత్యేకహోదా గురించి కేంద్రాన్ని అడిగారా? అని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు.. కేంద్రంలో భాగస్వామి పార్టీగా కూడా ఉన్న తెలుగుదేశం.. ప్రత్యేకహోదా కోసం ఏం చేసిందనే సంగతి ఆయన మర్చిపోతున్నారు. హోదా కోసం పోరాట స్ఫూర్తిని తొక్కేసింది తెలుగుదేశమే కదా అని ప్రజలు అడుగుతున్నారు. పోనీ, ఇప్పుడు బిజెపితో పొత్తుల కోసం ఎగబడుతున్న చంద్రబాబుకు.. పొత్తులు కుదరడానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే.. లేకపోతే.. పొత్తులు పెట్టుకోం అని కండిషన్ పెట్టగల ధైర్యం ఉందా? అని ప్రజలు అడుగుతున్నారు.
అదే సమయంలో మరో అంశం కూడా ముఖ్యమే. జగన్ అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చి తప్పారని చినబాబు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లోగా చేయలేకపోవడం అనేది జగన్ మాట తప్పడమే కావొచ్చు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీపీఎస్ స్థానంలో ఎంతో మెరుగైన జీపీఎస్ ను తీసుకువచ్చిన ఘనత జగన్ దే. దీనికి ఉద్యోగులే కన్విన్స్ అయ్యారు.
అయినా సరే వారిని రెచ్చగొట్టడానికి చినబాబు కుటిలయత్నం చేస్తున్నారు. పోనీ ఆయన ప్రయత్నం రాజకీయ అవసరం అనుకుందాం.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. జగన్ చేయలేకపోయిన సీపీఎస్ రద్దును తాము చేస్తాం అని చెప్పగల ధైర్యం లోకేష్ కు ఉందా అనేది పలువురి ప్రశ్న. సీపీఎస్ బదులు ఓపీఎస్ తెస్తాం అని చెప్పగలరా? అని ప్రజలు అడుగుతున్నారు.
ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేకుండా.. కేవలం జగన్ మీద నిందలు వేసుకుంటూ బతికిపోతాం అనుకుంటే.. ఇవాళ్టి రోజుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదని లోకేష్ తెలుసుకోవాలి.