అశోక్ పొలిటికల్ రిటైర్మెంట్ ఖాయమేనా?

విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన టీడీపీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడంలేదు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన…

విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన టీడీపీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడంలేదు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన అప్పుడ‌ప్పుడు అలా విజయనగరం వచ్చి పోతున్నారు.

ఎన్నికల వేడి రాజుకున్న వేళ అశోక్ ఈ విధంగా వ్యవహరించడం అనుమానాలకు దారి తీస్తోంది. ఆయన టీడీపీ అధినాయకత్వం వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు. తమ కుటుంబానికి రెండు టికెట్లు అశోక్ కోరారని అంటున్నారు. అయితే ఒక్కటే టికెట్ అంటూ టీడీపీ పెద్దల నుంచి వచ్చిన సమాచారంతోనే ఆయన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

అశోక్ గజపతిరాజుని మొదట అసెంబ్లీకి పోటీ చేయమని కోరారు. ఇప్పుడు విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయాలని అంటున్నారు. అసెంబ్లీకి తన కుమార్తె అదితి గజపతిరాజుని నిలబెట్టాలని అశోక్ భావిస్తున్నారు. కానీ దాన్ని హై కమాండ్ పడనివ్వడంలేదు.

ఆ సీటుని బీసీలకు ఇచ్చేందుకు చూస్తోంది. అదే సీటుని జనసేన కూడా కోరుతోంది. ఇవన్నీ చూస్తూంటే మెల్లగా అశోక్ కుటుంబం నుంచి విజయనగరం సీటుని తీసుకునే వ్యూహం కనిపిస్తోంది అని అంటున్నారు. అశోక్ ఈ పరిణామాల పట్ల కలత చెందారని అందుకే పొలిటికల్ రిటైర్మెంట్ ని త్వరలో అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ విషయం తరువాత కూడా టీడీపీ హై కమాండ్ ఏమీ కంగారు పడకుండా వేరే బీసీ అభ్యర్ధిని మాజీ ఎమ్మెల్యేను తెచ్చి విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయించాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది.

అశోక్ వర్గం దీని మీద మండిపడుతోంది అని అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాలలో మకుటం లేని మహరాజుగా వెలిగిన అశోక్ విషయంలో హై కమాండ్ తీరు బాగు లేదని అంటున్నారు. అశోక్ రాజకీయాలకు దూరం అయితే టీడీపీకి జిల్లాలో అది ఇబ్బందికరంగానే ఉంటుందని అంటున్నారు.