ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం సభ తరువాత పదిహేను రోజుల తేడాలో వ్యవధిలో మరోసారి విశాఖ వస్తున్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని విజేతలకు బహుమతులు అందచేస్తారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇటీవల కాలంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో టీడీపీ జనసేన నేతలతో పాటు కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు షర్మిల కూడా పర్యటిస్తూ వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నారా లోకేష్ అయితే శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రాలోనే ఉన్నారు. నాగబాబు నాలుగైదు రోజుల పాటు విశాఖలో బిజీగా కలియ తిరిగారు. వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేశారు వీటన్నిటికీ జగన్ జవాబు చెబుతారా అన్నది వైసీపీ నేతలలో ఉంది.
ముఖ్యంగా నారా లోకేష్ అలాగే చంద్రబాబు ఉత్తరాంధ్రా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ ఏమీ చేయలేదని నిందిస్తున్నారు. వీటికి సీఎం హోదాలో జగన్ తగిన సమాధానం ధీటుగానే ఇస్తారు అని అంటున్నారు. విశాఖకు వైసీపీ చేసింది ఏమిటి అన్నది కూడా ముఖ్యమంత్రి వివరిస్తారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రను రాజకీయ క్షేత్రంగా చేసుకుని ఇటీవల కాలంలో విపక్షాలు చేస్తున్న అన్ని విమర్శలకు జగన్ ఒక్కటే సమాధానం ఇస్తారు అన్నది వైసీపీ వర్గాల మాటగా ఉంది. జగన్ ఏమి మాట్లాడుతారు అన్నది అయితే చూడాలి.