“ఏ కులమూ నీదంటే
గోకులమూ నవ్వింది..
మాధవుడు యాదవుడు
మాకులమే లెమ్మంది..”
అని “సప్తపది”లో వేటూరి పాట గుర్తొస్తోంది ప్రస్తుతం ఒక సందర్భానికి.
“యాత్ర-2” తీసిన మహి వి రాఘవ్ ది రెడ్డికులం అంటూ, అందుకే మదనపల్లిలో రెండెకరాల భూమిని స్టూడియో కట్టే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధారాదత్తం చేసేసిందని ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. “మనోడే” అన్న ఫీలింగుతో ముఖ్యమంత్రి ఈ ల్యాండ్ గిఫ్టిచ్చాడంటూ పెన్ను పిసేకుసుకుంటూ రాసేసింది మన జ్యోతి.
పేరు వెనుక తోక తగిలించుకోకున్నా మహి.వి.రాఘవ్ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి సన్నాఫ్ రాఘవరెడ్డి అంటూ ఏంటో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్టు ఫీలైపోతూ రాసిన ఆ వార్త చూస్తే నవ్వొస్తుంది. పేర్ల వెనుక తోకలొద్దని కొందరు తగిలించుకోకపోయినా అదే పనిగా ఆ తోక తగిలించి మరీ కులంపేరుతో రాతలు చూస్తే ఏమనాలి?
మహీకి స్టూడియో నిమిత్తం ఇస్తున్న ఈ స్థలం విలువ అక్షరాలా 2 కోట్ల రూపాయలు. అది కూడా ఫ్రీగా ఇవ్వడం లేదు. కనీస ధరకి కొనుక్కోవాలి. కానీ ఈ సత్యాన్ని పక్కదోవ పట్టించి 20 కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇస్తున్నట్టు పేర్కొంది ఆ అంధజ్యోతి.. సారీ ఆంధ్రజ్యోతి.
అవును జ్యోతీ! గురువిందగింజ సామెత చెప్పినట్టు అసలు చంద్రబాబు హయాములో జరిగిన భూపందేరాలు లోకానికి తెలియదా ఏంటి?
హైదరాబాదులో తెదేపా ఆఫీసు పైకెక్కి చుట్టూ చూస్తే అన్నీ ఒక కులానికి కట్టబెట్టిన భూములే కదా.
అంత ప్రైం లొకేషన్లో ఎన్.టి.ఆర్ భవన్ కి ఆనుకుని ప్రసాద్ ల్యాబ్. అది ఎన్ని ఎకరాలు? అది ఏ కులం వారిది?
దానికి ఎదురుగా స్టూడియో కోసం ఇచ్చిన స్థలంలో పెద్ద కమెర్షియల్ కాంప్లెక్స్, సినిమా హాళ్లు కట్టుకున్న కె. రాఘవేంద్ర రావు. ఇది బాబుగారి పంపకం కాదా!
ఇక మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి వైపు చూస్తే అక్కడ “జయభేరి” మోగించిన భూములు ఎవరి హయాములో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగుండాలి?
ఇక గతంలో స్టూడియో కోసం ప్రభుత్వమిచ్చిన పద్మాలయా భూములు రియల్ ఎస్టేట్ అయిపోలేదా? అవి ఏ కులం భూములు?
దగ్గుబాటి కుటుంబానికి నానక్ రాం గూడా స్టూడియో కేటాయింపు చేసిందెవరు? బాబుగారు కాదా! ఆ స్థలంలో ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ ఎలా ఉంది?!
ఇవన్నీ కాదు… అసలు సిసలు కుంభస్థలం రామోజీ ఫిల్మ్ సిటీ. బాబుగారి వితరణశీలతకి ఎంతమంది రైతుల, సామాన్యుల భూములు బలయ్యాయి? ఇప్పటికీ ఆ వివాదం నడుస్తూనే ఉంది కదా!
ఇవన్నీ జ్యోతికి తెలీదా? వీటితో పోలిస్తే మహి కి మదనపల్లి హార్సిలీ హిల్స్ లో జగన్ ఇస్తున్నది ఎంత? దాని విలువెంత? ఎదుగుదలకి అవకాశమెంత?
ఏ స్థలం ఎందుకిచ్చారు.. ఎవరు ఎవరికి ఇచ్చారు… పుచ్చుకున్నవాళ్లు ఏం చేసారు..ఇవ్వడం న్యాయమా అన్యాయమా..వంటి మోరల్స్ అన్నీ కాసేపు పక్కనపెట్టి ప్రాక్టికల్ గా ఒకటనుకుందాం!
“మనోడు” అయితే పక్కనోడి ఇస్తట్లో కూడా చెయ్యి పెట్టి పంచభక్ష్య పరమాన్నాలూ తినేయొచ్చా?
మనోడు కానివాడికి మాత్రం రెండు మెతుకులు కూడా పెట్టకూడదా?
ఇదెక్కడి న్యాయం జ్యోతీ!
కాసేపు హైదరాబాద్ విషయం, కులం గోల పక్కన పెట్టి..ఇది మదనపల్లి టాపిక్ అనుకుని రాయలసీమ విషయానికొద్దాం.
చంద్రబాబు రాయలసీమ వ్యక్తి. అతని నియోజకవర్గం చిత్తూరులోని కుప్పం. ఆ జిల్లాకి కనీసం హైవే తీసుకొచ్చాడా తన హయాములో? ఇక ఆ పక్కనున్న అనంతపురానికి ఎయిమ్స్ వస్తుంటే దానిని అమరావతికి డైవర్ట్ చేసాడు. అంటే ఏంటి? అయ్యవారికి రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదా?
రాయలసీమ వెనుకబాటుకి కారణం తెదేపానే.
అక్కడ స్టూడియో వస్తుందన్నా గోలే.
హైకోర్టు పెట్టాలన్నా ఏడుపే.
తిరుపతికి కాలేజీలొస్తున్నా బాధే.
కుప్పం మునిసిపాలిటీ అయ్యిందన్నా దిగులే.
ఏమన్నా అంటే అమారారాజా ఫ్యాక్టరీని చిత్తూరు నుంచి తోలేసింది వైకాపా ప్రభుత్వం కాదా అంటూ వంకర్లు తిరుగుతారు.
కాలుష్య కారణాలు భయంకరంగా ఉన్నాయని పొల్యూషన్ బోర్డు చెప్పినా కూడా ప్రజల ప్రాణాలు పక్కన పెట్టి ఇండస్ట్రీని అలాగే ఉంచేయాలా? తీసేయమంటే యాంటి-డెవలప్మెంట్ ప్రభుత్వమంటారా?
చంద్రబాబు ఈ అమారారాజకి ఏకంగా 500 ఎకరాలు పరిశ్రమ పెట్టడానికి కేటాయించడం జరిగింది. కానీ పదేళ్లైనా అక్కడ ఇటుక కూడా పెట్టకపోతే వైకాపా ప్రభుత్వం నోటీసు పంపింది. దానిని కక్షసాధింపంటారా?
మనోడికి భూమి ఇస్తే అది రాష్ట్రం కోసమా?.. అదే మనోడు కాకుండా ఎవరికిచ్చినా అది స్వార్ధం కోసమా! ఏంటో!!!
“యాత్ర-2” తీసిన దర్శకుడు రెడ్డి అని పెద్ద రహస్యాన్ని కనుగొన్నట్టు రాసినప్పుడు “కథానాయకుడు”, “మహానాయకుడు” అంటూ ఎన్.టి.ఆర్ బయోపిక్ తీసిన క్రిష్ అసలు పేరు జాగర్లమూడి రాధాకృష్ణ చౌదరి అని రాయలేదేం? అలా రాయబట్టే ఇలా అనాలనిపిస్తుంది ఎవరికైనా!
అందుకే…పైన చెప్పుకున్న వేటూరి గీతాన్ని కాస్త మార్చుకుని ఇలా పాడుకోవాలనిపిస్తుంది-
“మహీ కులం రెడ్డంటే
నీ కులమే నవ్వింది
మురళిమోహనుడు, రాఘవుడు
మా కులమే లెమ్మంది”
– హరగోపాల్ సూరపనేని