జీవిత పయనంలో మనకు తారాసపడే వ్యక్తుల్లో అతి తక్కువ మంది మాత్రమే మనకు కొన్ని విధాలుగా అయినా నచ్చుతారు! వారి వ్యక్తిత్వం, మనతో వ్యవహరించే తీరు వంటివి పరిశీలిస్తే.. కొంతమంది మాత్రమే మనకు సెట్ అవుతారనిపిస్తుంది! మరి అలా వారు తారసపడినప్పుడు వారితో స్నేహబంధాన్ని అస్సలు మిస్ కావొద్దని అంటారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. మరి ఇంతకీ లక్షణాలను కలిగిన వారిని అస్సలు వదులుకోకూడదనే అంశం గురించి కూడా వారే వివరిస్తున్నారు. మరి ఆ జాబితా ఎలా ఉంటుందంటే!
అన్ కండీషనల్ సపోర్ట్ ఇచ్చే స్వభావం!
ఇది తక్కువ మందిలో ఉండే స్వభావం! మనతో ఏదో అవసరం ఉంటే మాట్లాడేవారు, మనతో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే వారు, అవసరం తీరిన తర్వాత అసలు పట్టించుకోని వారే చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే అతి తక్కువ మంది అన్ కండీషనల్ గా, మన ప్రవర్తన, మన తీరుతో కూడా సంబంధం లేకుండా సపోర్టివ్ గా ఉంటే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు జీవితంలో అరుదుగా అయినా తారసపడుతూ ఉంటారు. అలాంటి వారి సాన్నిహిత్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దనే నిపుణుల సలహా!
ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం!
మన కష్టాన్ని తక్కువ చూసే స్నేహితులే ఎక్కువ మనకు. మనలోనే ప్రత్యేకమైన కొన్ని తత్వాలను గుర్తించి అభినందించే వారు, ఎంకరేజ్ చేసే వారు, మోటివేట్ చేసే వాళ్లు తక్కువమందే ఉంటారు! ఇందుకు భిన్నంగా మీలో మంచి గుణాలను గుర్తించి వాటి వరకూ అయినా అభినందించే వారు, మీరు మరో మెట్టు పైకి ఎదగడానికి మాటలతో అయినా సహకారం అందించే వారిని చుట్టూ ఉంచుకోవడం అవసరమే! వీరు కూడా దొరకడం అరుదే. దొరికితే మాత్రం వారితో సాన్నిహిత్యం జీవితకాలం కొనసాగించగలిగినదే!
నిజాయితీ, పారదర్శకత!
ఇవి చాలా అరుదైన లక్షణాలు, అందరిలోనూ ఉండని లక్షణాలు. మీతో ప్రవర్తన విషయంలో అయినా, ఇతరుల విషయంలో అయినా.. నిజాయితీగా తమ తత్వాన్ని వ్యక్త పరిచే వారు, పారదర్శకంగా ఉండే వారు తోడుండటం చాలా మంచిది. ఏ విషయంలో అయినా కన్ స్ట్రక్టివ్ గా క్రిటిసిజం కూడా వీరు చేయగలరు. ఇది మీ ఎదుగుదలకు కచ్చితంగా ఉపయోగకరమైనది!
హద్దులేమిటో తెలిసినవారు!
ఎంత స్నేహం ఉన్నప్పటికీ, తమ స్నేహంలో హద్దులు, సరిహద్దులు, ఏ జోన్ వరకూ తాము వెళ్ల వచ్చు, ఎక్కడకు తాము ఎంటర్ కాకూడదనే అంశంపై స్పష్టత కలిగిన స్నేహితుల సాంగత్యం కూడా దీర్ఘకాలంగా కొనసాగుతుంది. స్నేహితులమనో, సాన్నిహిత్యం కలిగిన వారమనే అభిప్రాయాలతో హద్దులు మరిచిపోవడం ప్రశాంతతను లేకుండా చేసే అంశం. మరి అలాంటి హద్దులు ఎరిగిన వారిలో స్నేహం చాలా పద్ధతిగా ఉంటుంది.
మీ విజయాన్ని మనస్పూర్తిగా అభినందించేవారు!
మీ విజయానికి వారు పండగ చేసుకోకపోయినా ఫర్వాలేదు, మీ సక్సెస్ ను చూసి వారు బాధపడ, మనస్ఫూర్తిగా అభినందించే తీరు ఉన్నవారి స్నేహం పొందడం అదృష్టమే! నువ్వు చేయగలవనే ధీమాను మీకు ఇవ్వడంతో పాటు, మీరు విజయం సాధించినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించగలిగిన వారి స్నేహం ఉత్సాహాన్ని ఇస్తుంది.
మరి సాధారణ వ్యక్తుల్లో ఇవి అసాధారణ లక్షణాలు. ఇలాంటి లక్షణాలన్నీ ఒక్కరిలో లేకపోయినా.. జీవితంలో తారస పడే వ్యక్తుల్లో ఇలాంటి ఒక్కో దశలో ఈ లక్షణాలను పరిశీలించగలిగినా, వారితో స్నేహం మంచిదే అవుతుంది.