పెద్ద సినిమా వస్తే టికెట్లు పెంచుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్2.. ఇలా ఏ పెద్ద సినిమా వచ్చినా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఆచార్యకు కూడా పెంచారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ ప్రత్యేక జీవోలు ఇచ్చాయి. ఇది ఎంత వరకు కరెక్ట్? ఇకపై పెద్ద హీరోల సినిమాలకు మొదటి వారం, పది రోజులు టికెట్ రేట్ల కింద పెద్ద మొత్తాల్లో చెల్లించుకోవాల్సిందేనా?
ఈ ప్రశ్నకు చిరంజీవి సూటిగా సమాధానం చెప్పారు. బడ్జెట్ కు తగ్గట్టు టికెట్ రేట్లు పెంచడంలో తప్పు లేదన్నారు. పైగా ఇండస్ట్రీ నుంచి నికార్సుగా ట్యాక్స్ వెళ్తున్నప్పుడు, ఆపత్కాలంలో ఇలా వెసులుబాటు అడగడంలో తప్పు లేదన్నారు చిరంజీవి. ఆచార్య సినిమాకు అచ్చంగా 50 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించామని ఈ సందర్భంగా చిరంజీవి బయటపెట్టారు.
“కరోనా వల్ల ప్రతి రంగం కుంటుపడింది. టాలీవుడ్ కూడా చితికిపోయింది. ఓ సినిమాకు కేవలం వడ్డీనే 50 కోట్లు కట్టినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? మేం కట్టాం. అక్షరాలా 50 కోట్లు వడ్డీ కట్టాం. ఆ డబ్బు ఎవరిస్తారు? ప్రభుత్వాలు కనికరించి జీవో ఇస్తే, ప్రేక్షకులు కరుణించి మనం కూడా ఓ 10 రూపాయలు వేద్దాం అని ముందుకొస్తున్నారు. ఇది అడుక్కుంటున్నట్టు కాదు. అవసరంలో ఉన్నాం. వినోదం ఇద్దామని భారీ బడ్జెట్ పెట్టాం. అనుకోని పరిస్థితుల్లో వడ్డీ పెరిగింది. మా వడ్డీతో ఓ మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమా తీయొచ్చు. కాబట్టి టికెట్ రేట్ల కోసం వేడుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే, మేమంతా అత్యథికంగా ట్యాక్సులు కడుతున్నాం. అందులోంచి కొంత ఇవ్వండని అడగడంలో తప్పు లేదనిపిస్తోంది.”
ఇదే సందర్భంలో దర్శకుడు కొరటాల శివ కూడా కొన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. ఆచార్య సినిమా కోసం తను ఇప్పటివరకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపిన కొరటాల.. ఎకౌంట్స్ కూడా ఇంకా సెటిల్ చేసుకోలేదన్నారు.
“మీరు (జర్నలిస్ట్) ఓసారి ఆఫీస్ కు రండి, సరదాగా ఎకౌంట్స్ చూద్దాం. ఎంత ఖర్చయిందో నాకే ఇంకా అర్థంకావడం లేదు. చిరంజీవి మూడేళ్లు పనిచేశారు. చరణ్ 40 రోజులు పనిచేశారు. ఇక నా విషయానికొస్తే.. నాలుగేళ్ల నుంచి ఇదే సినిమా చేస్తున్నాను. నేను ఇప్పటివరకు డబ్బులు తీసుకోలేదు. ఎకౌంట్స్ సెటిల్ చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచితే తప్పేంటి? అయినా బడ్జెట్ బట్టి టికెట్ రేట్లు పెంచుతారు. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ కు తగ్గట్టు టికెట్ రేట్లు పెంచారు, అలాగే ఆచార్యకు కూడా ఓ మోస్తరుగా పెంచారు.”
ఆచార్య ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి, కొరటాల, రామ్ చరణ్, పూజాహెగ్డే కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సినిమాలో కాజల్ లేదనే విషయాన్ని ఇప్పటికే కొరటాల ప్రకటించాడు. ఇదే అంశంపై చిరంజీవి రియాక్షన్ కోసం మీడియా ప్రతినిథి ప్రయత్నించగా.. ఒకింత అసహనం వ్యక్తం చేశాడు ఈ దర్శకుడు.