నెల్లూరు కోర్టులో చోరీపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐకి విచారణ బాధ్యతలు అప్పగించినా అభ్యంతరం లేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తెలిపారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసు పత్రాలు, ఆధారాలు ఈ నెల 13న నెల్లూరు కోర్టు నుంచి చోరీ కావడం సంచలనం రేకెత్తించింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)గా సుమోటోగా నమోదు చేసింది.
దర్యాప్తులో భాగంగా వేలిముద్రలు, పాదముద్రల ఆధారాలను పోలీసులు సేకరించలేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదికలో పేర్కొన్నారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ను కూడా పిలువలేదని ప్రస్తావించారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని నివేదికలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
సుమోటోగా స్వీకరించిన హైకోర్టు …మొత్తం 18 మందిని ప్రతివాదులుగా చేర్చింది. ఇందులో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై మంగళవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించినా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ డైరెక్టర్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు ఏ దశలో ఉందో నివేదించాలని డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. మంత్రి కాకాణికి సంబంధించిన కేసు కావడంతో ఉత్కంఠ నెలకుంది.