ఏపీ, తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. విమర్శలు ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. అధికార పార్టీలపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికారంలో ఉన్న పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుస్తున్నారు. కానీ రోజులు మారేకొద్దీ ఈ విమర్శలు పూర్తిగా రివర్స్ అయిపోతాయేమోననే అంచనాలున్నాయి.
ఇప్పుడు తిట్టుకున్నవారే కొన్నిరోజుల తర్వాత ఒకరినొకరు పొగుడుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కి మద్దతిస్తే..
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ కోసం కూడా పనిచేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే.. టీఆర్ఎస్ ని కూడా ఆ కూటమిలో కలిపే అవకాశముందని అంటున్నారు. దానికి తగ్గట్టే ఇటీవల కేసీఆర్ రాహుల్ గాంధీకి వంతపాడారు, బీజేపీని చెడామడా తిట్టేస్తున్నారు.
కానీ తెలంగాణ కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా కేసీఆర్ ని తిడుతూనే ఉన్నారు. రేపు కాంగ్రెస్, టీఆర్ఎస్ దోస్తీ ఖరారైతే రేవంత్ రెడ్డి పరిస్థితేంటి? కేసీఆర్ ని తిట్టడం ఆపేసి పొగడాలా..? అంతటి వీరుడు శూరుడు లేరు, ఆయన సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ఉందని కీర్తించాలా..? ఆయనతో కలసి వేదికలెక్కాలా..? ఒకే దండలో రెండు తలలు పెట్టాలా..? గులాబి కండువాలతో కలిపి కూర్చోవాలా..? అలా చేస్తే రేవంత్ రెడ్డి తెలంగాణలో పూర్తిగా అలుసైపోవడం ఖాయం.
పార్టీకి మంచి జరుగాలంటే రేవంత్ ఆమాత్రం త్యాగం చేయక తప్పదు. తిట్టిన నోటితోనే కేసీఆర్ ని పొగడాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి.
ఏపీలో బీజేపీ, టీడీపీతో కలిస్తే..
ఇక్కడ ఏపీలో కూడా పొత్తుల వ్యవహారం రోజురోజుకో మలుపు తిరుగుతోంది. ఏ పార్టీ ఏ మలుపు తిరిగినా చివరకు 2024 ఎన్నికలనాటికి వైసీపీ ఒక్కటే ఒకవైపు.. బీజేపీ, జనసేన, కూటమి మరోవైపు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి.
ఎన్నికల సమయానికి టీడీపీతో వారు కలవడం అనివార్యం అని తేలిపోయింది. అప్పుడు టీడీపీని చెడామడా తిడుతున్న వీర్రాజు పరిస్థితి ఏంటి..? చంద్రబాబుని ఓ రేంజ్ లో వాయిస్తోన్న వీర్రాజు అప్పుడు ఆయన్ని పొగడాల్సి వస్తుంది. జగన్ పాలన కంటే గతంలో చంద్రబాబు పాలనే బాగుందని అనాల్సిందే.
పోలవరంతో మొదలు పెట్టి అన్నిటిలోనూ చంద్రబాబు చేసిన దారుణాలకు వీర్రాజు అయిష్టంగానే వంతపాడాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకూ తిట్టిన నోళ్లే రేపు పొగడాల్సి వస్తుందనమాట.
పొత్తుల విషయంలో ఓ క్లారిటీ వస్తే ఇప్పటి తిట్ల పురాణం ఆగిపోతుంది, కొత్తగా పొగడ్తల వ్యవహారం మొదలవుతుంది. అందుకే అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ వీర్రాజు మింగలేక కక్కలేక అన్నట్టు ఉన్నారు. సడన్ గా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ని పొగిడితే.. ఇక్కడ వీర్రాజు, చంద్రబాబుకి భజన చేస్తే.. భలే విచిత్రంగా ఉంటుంది.