చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అంటారు సినిమాలో పవన్ కల్యాణ్. ఇప్పుడు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు ఎపిసోడ్ లో కూడా చివరి పంచ్ మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చారు, నిజంగానే చివరి పంచ్ లో ఉండే కిక్ వేరబ్బా అనే లెవల్లో ఉన్నాయి పేర్ని సెటైర్లు.
గతంలో మంత్రి హోదాలో పవన్ పై విరుచుకుపడిపోయిన నాని, ఇప్పుడు మంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారిగా పవన్ పై సెటైర్లు పేల్చారు. ఆయన దత్తపుత్రుడు కాదని, బంటు, బానిస అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వావి వరసలు లేవు..
వావి వరసలు లేనివాడివి అని ఎవరినైనా తిట్టారంటే అంతకంటే పెద్ద అవమానం ఇంకోటి ఉండదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ని కూడా పేర్ని నాని ఆ మాట అనేశారు. రాజకీయాల్లో ఆయనకు వావి వరసలు లేవన్నారు. జనసేనకు సిద్ధాంతాలు లేవని ఎద్దేవా చేసారు.
చంద్రబాబు సీఎం కావాలని పవన్ పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు నాని. ప్రజలంతా జగన్ కే మరోసారి బ్రహ్మరథం పట్టబోతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలను కూడా సింగిల్ గానే ఎదుర్కొంటామని, తాము పొత్తుల గురించి కాకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తామన్నారు నాని.
చిరంజీవిపై ప్రేమ ఉందా..?
పవన్ కల్యాణ్ కి ఎంతసేపు చంద్రబాబుపై ప్రేమ ఉంటుందని, ఆ ప్రేమను ఆయన సొంత అన్నయ్య అయిన చిరంజీవిపై ఎందుకు చూపించరని ప్రశ్నించారు నాని. చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.
చిరంజీవి విలువలున్న వ్యక్తి అని కొనియాడారు. చిరంజీవిని అభిమానించెవారెవరూ పవన్ ని రాజకీయాల్లో ఆరాధించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు నాని.
దత్తపుత్రుడు అని అంటుంటే పవన్ గింజుకుంటున్నారని, ఆయన అసలు దత్తపుత్రుడు కాదని.. చంద్రబాబుకి బానిస అని తేల్చేశారు నాని.
గతంలో నాని-పవన్ మధ్య మాటల యుద్ధం ఎపిసోడ్ ల కొద్దీ కొనసాగింది. ఇప్పుడు మరోసారి నాని సెకండ్ పార్ట్ స్టార్ట్ చేశారు. మరి దీనికి పవన్ నుంచి కౌంటర్ ఉంటుందో లేదో చూడాలి.