“దట్టమైన అడవి.. మధ్యలో ఓ నది.. దానికి అటువైపు చిరు-చరణ్.. ఇటువైపు చిరుతలు.” ఆచార్య సినిమాకు హైప్ తీసుకొచ్చిన షాట్ అది. అప్పటివరకు ఉన్న అంచనాలు ఒకెత్తు, ఆ సన్నివేశం తర్వాత ఏర్పడిన అంచనాలు మరో ఎత్తు. ఇలా అత్యంత ప్రత్యేకంగా నిలిచిన ఆ షాట్ గురించి చరణ్ ప్రత్యేకంగా మాట్లాడాడు. అసలు ఆ షాట్ ఎందుకు తీస్తున్నారో దర్శకుడు తమకు చెప్పలేదన్నాడు.
“డీప్ ఫారెస్ట్ లో ఉన్నాం. అప్పటికే సన్ లైట్ తగ్గిపోతోంది. ఆరోజు తీయాల్సిన షాట్స్ అయిపోయాయి. ప్యాకప్ చెప్పడానికి రెడీ అవుతున్నాం. అంతలోనే కొరటాల శివ మా దగ్గరకు హడావుడిగా వచ్చాడు. ఇంకొక్క షాట్ ఉందన్నాడు. సరే అని చెప్పి నది ఒడ్డుకు వెళ్లాం. నన్ను నీళ్లు తాగమన్నారు, చిరంజీవిని వెనక నుంచి నడవమని చెప్పారు. కెమెరా యాంగిల్ మాత్రం నది అటువైపు నుంచి ప్యాన్ చేస్తూ తీశారు. చిరంజీవి గారికి అర్థం కాలేదు. ఏంటి అలా చేస్తున్నారు, ఏదైనా సమస్య ఉందా అని అడిగారు. మాకేం చెప్పకుండానే ఆ షాట్ తీసేశారు కొరటాల.”
అలా తమకు అసలు విషయం చెప్పకుండానే కొరటాల ఆ షాట్ తీశాడని చెప్పుకొచ్చాడు చరణ్. అటవీప్రాంతం కావడం వల్ల లైట్ తొందరగా ఫెయిల్ అయిపోతోందని, ఆ హడావుడిలో తమకు సీన్ వివరించకుండానే కొరటాల ఆ షాట్ తీశారని, ఆ తర్వాత సీన్ మొత్తం వివరించారని చెప్పుకొచ్చాడు.
కొరటాల ఇప్పటివరకు తీసిన కమర్షియల్ షాట్స్ లో అదే ది బెస్ట్ అంటున్నాడు రామ్ చరణ్. ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టిన రామ్ చరణ్.. సినిమాలో అసలు కథ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది ఆచార్య.