ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సిన సమయం. జగన్ సర్కార్ వైఖరితో ఏపీకి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో పరిశ్రమ పెట్టేందుకు మార్గం సుగుమమైంది. ఇందుకు జగన్ చొరవే కారణం.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నాయి. రెండేళ్లలో పరిశ్రమ పూర్తిస్థాయిలో నిర్మితమై సుమారు 1000 మందికి ఉపాధి కల్పించనుంది.
పరిశ్రమ ఏర్పాటులో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ పరిశ్రమ ద్వారా అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ చేయనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ కలుసుకున్నారు.
ఫ్యాక్టరీ ఏర్పాటులో తమకు ఎదురవుతున్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం, ఆయన వెంటనే సానుకూలంగా స్పందించడం చకచకా జరిగిపోయాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రూ.2,700 కోట్లతో నెలకొల్పిన కాస్టిక్ సోడా ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ పరిశ్రమ ద్వారా 1300 మందికి ప్రత్యక్షంగా, అలాగే 1150 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల అమలుకే ప్రభుత్వం పరిమితమైందనే విమర్శల నేపథ్యంలో, పరిశ్రమల ప్రారంభం, స్థాపన కార్యకలాపాలు శుభపరిణామంగా చెప్పొచ్చు.