మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా మరోసారి జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో బుధవారం సీఎం భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైఎస్ జగన్ ప్రతి నిర్ణయం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తారనేది జగమెరిగిన సత్యం. ఆర్థికంగా ఎన్ని కష్టాలొస్తున్నా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. జగన్ పాలనలో అభివృద్ధికి చోటు లేదనే విమర్శ బలంగా ఉంది. దీన్ని అధిగమించడం జగన్‌కు పెద్ద సవాలే. అయితే దీనికంటే 2024 ఎన్నికలకు గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను గతంలో మాదిరి కదిలించడం అంత సులువు కాదని చెప్పొచ్చు.
జగన్‌ను సీఎం చేయాలనే తపనతో వైసీపీ శ్రేణులు పదేళ్ల పాటు ఎంతో శ్రమకోర్చాయి. 2009-14 వరకు కాంగ్రెస్, 2014-19 మధ్య టీడీపీ పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని రకాలుగా నష్టోయారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారు. జగన్‌ను సీఎం చేసుకోవడం ద్వారా తమ కష్టాలు తొలగిపోతాయని నమ్మారు. అందుకే జగన్ సీఎం అయితే చాలు, తామే ఆ పీఠంపై ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. వైసీపీ పదేళ్ల శ్రమకు తగ్గ ఫలితం దక్కింది.
వైఎస్ జగన్ అసాధారణ మెజార్టీతో అధికార గద్దెనెక్కారు. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆశలు మాత్రం అడియాసల య్యాయి. కోరుకున్న దానికి భిన్నంగా అధినాయకుడి పాలన సాగుతోందన్న తీవ్ర అసంతృప్తి ప్రతి ఒక్కరిలో గూడుకట్టుకుంది. మూడేళ్ల జగన్ పాలన పూర్తయ్యింది. జగన్ పాలనపై ప్రతిపక్షాలు, సామాన్య జనంలో కంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉండడం గమనించాల్సిన అంశం. ఇదే వైసీపీకి భవిష్యత్‌లో నష్టం కలిగిస్తుందనే ఆందోళన నెలకుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు జగన్ కీలక సమావేశం నిర్వహించేందుకు ముందుకొచ్చారు. జగన్ అవసరం కాబట్టి, జనంలోకి రావాలని అనుకుంటున్నారని, అయితే తమకేంటని వైసీపీ దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలు నైరాశ్యంతో ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తే, ఏదో చేస్తారని ఆశించామని, ఆ ఆశలు ఆవిరయ్యాయని, ఇప్పుడు మళ్లీ ఆయన కోసం ఎందుకు శ్రమించాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం త్వరలో జిల్లాల పర్యటనకు సమాయత్తం అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలను కూడా ఇంటింటికి పంపి, గడిచిన కాలంలో తమ వల్ల లబ్ధి జరిగిందని, మరోసారి అధికారం ఇవ్వాలనే వినతితో జనంలోకి వైసీపీ వెళ్లడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది.
అయితే పార్టీలు, రాజకీయాలు, సిఫార్సులతో నిమిత్తం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయని జగన్ పదేపదే చెబుతున్నారని, ఇప్పుడు ఓట్లు కూడా అట్లే వేయించుకుంటారని, తమతో పనేంటని వైసీపీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు సెటైర్స్ వేస్తున్నారు. దీన్ని బట్టి పార్టీలో ఏ స్థాయిలో అసంతృప్తి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కేవలం తన చేతిలోనే పవర్ పెట్టుకుని, పార్టీ నాయకుల్ని డమ్మీలు చేసిన సీఎం… రానున్న రోజుల్లో సొంత పార్టీలోని అసంతృప్తిని అధిగమించడం పెద్ద సవాలే.