చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రజాస్వామిక స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు తాను మాట్లాడితే.. తన పాలనలో తాను అనుసరించిన అత్యంత దుర్మార్గమైన విధానాలు గుర్తు చేసుకుని ప్రజలు నవ్వుతారనే స్పృహ కూడా ఆయనకు కలగడం లేదు. ప్రజా ఉద్యమాల గురించి చంద్రబాబునాయుడు నీతులు వల్లించడం చూస్తోంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సీపీఎస్ రద్దు విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటాం అని.. ఇందులో ఉద్యోగ సంఘాల వారిని కూడా భాగస్వాముల్ని చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి సర్కారు పీఆర్సీ ప్రతిష్ఠంభన సమయంలోనే చాలా విస్పష్టంగా ప్రకటించింది. సీపీఎస్ అనేది కేవలం ఉపాధ్యాయులకు మాత్రం సంబంధించిన సమస్య కాదు. అందరు ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన విషయం.
ప్రభుత్వం తమ ప్రయత్నం తాము చేస్తానని అన్నది గనుక.. వారు చేసే వరకు వేచిచూడాలనే ఉద్దేశంతోనే మిగిలిన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఉపాధ్యాయ సంఘాల్లో ఒకరికి మాత్రం సహనం లేకపోయింది. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమాన్ని చేయడం కూడా ఒక ఎత్తు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాలని చేయడం ఇంకో ఎత్తు. వారికి సమస్యను పరిష్కరించుకోవడంకంటె సంచలనం సృష్టించడమే ప్రధానం అనిపించింది. అలాంటి నేపథ్యంలో పుట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం అడ్డుకుంది.
జరిగింది ఇదైతే.. మధ్యలో చంద్రబాబునాయుడు తగుదునమ్మా అంటూ తలదూర్చారు. ‘హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా?’ అంటూ ఆయన సుద్దులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ఏలుబడి సాగించిన తొలి అయిదేళ్లలో ఏ చిన్న ప్రజా ఉద్యమాన్ని కూడా ఉక్కుపాదంతో అణిచేసిన దుర్మార్గమైన నీచమైన చరిత్ర చంద్రబాబునాయుడుది.
చిన్న ఉద్యమానికి పిలుపు ఇచ్చినా సరే.. ఎక్కడికక్కడ గృహనిర్భంధాలతో చెలరేగిపోయారు ఆయన. ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఉద్యమిస్తోంటే.. వాటిని చాలా దుర్మార్గంగా అణిచేసి.. పాలనకాలం ముగింపుకు వచ్చే సమయానికి ధర్మపోరాట దీక్షలు అంటూ.. మొసలి కన్నీరు కారుస్తూ సభలు పెట్టి రచ్చ చేసిన వ్యక్తి ఆయన.
ప్రజలను గొంతు విప్పనివ్వని ముఖ్యమంత్రిగా ముద్రపడ్డారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు మాత్రం.. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా అని అంటున్నారంటే.. అది దెయ్యాలు వేదాలు వల్లించడం కాక మరేమిటి అని ప్రజలు విస్తుపోతున్నారు.
ఇంత జరుగుతోంది కదా.. చంద్రబాబునాయుడుకు.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. తొలి సంతకం సీపీఎస్ రద్దుమీద చేస్తా అని చెప్పగల ధైర్యం ఉందా? ఆ మాట చెప్పగల తెగువ ఉంటే మాత్రమే ఆయన ఈ విషయం గురించి మాట్లాడాలి. అని ప్రజలు అంటున్నారు.