జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిస్సందేహంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు చేతిలో మనిషి అని చాటడంలో నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి విజయవంతం అవుతోంది.
ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ఎంత ఉన్నా.. పవన్ కల్యాణ్ తీరే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడును పల్లెత్తు మాట అనడు పవన్. అదే అధికారంలో జగన్ ఉన్నా లేకపోయినా పవన్ టార్గెట్ మాత్రం ఉంటుంది.
ఈ రకంగా చంద్రబాబు తరఫున చంచాగిరి చేసే వ్యక్తిగా పవన్ కల్యాణ్ తన ఇమేజ్ ను పెంపొందించుకున్నాడు. తీరా ఇప్పుడేమో దత్తపుత్రుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటుండే సరికి పవన్ కల్యాణ్ గింజుకుంటున్నారు! మరి ఈ గింజుకోవడం చూస్తుంటే.. పవన్ కు ఈ ట్యాగ్ నచ్చడం లేదని స్పష్టం అవుతోంది.
తనను దత్తపుత్రుడు అంటే సహించేది లేదని పవన్ హెచ్చరిస్తునే ఉన్నారు. అయితే సహించను, భరించను అనే డైలాగులు చెబితే చాలదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నట్టుగా తను చంద్రబాబు దత్తులో లేనట్టుగా పవన్ కల్యాణ్ నిరూపించుకోవాలి!
అంటే.. చంద్రబాబును మాట వరసకు అయినా విమర్శించాలి! చంద్రబాబు మోసం చేసిన వైనాలను ప్రస్తావించాలి. జగన్ ను నోటికొచ్చినట్టుగా విమర్శించడం కాదు, చంద్రబాబును కూడా ఎండగట్టి… ఇద్దరికీ తను ప్రత్యామ్నాయం అని అయినా కనీసం పవన్ చెప్పుకోవాలి!
అలా కాకుండా.. ఓట్లను చీలనివ్వను, చంద్రబాబుతో సీట్లను పంచుకుంటాను అంటే మాత్రం పవన్ కల్యాణ్ ఇమేజ్ అణువంతైనా మారదు! చంద్రబాబుతో ఇప్పటి వరకూ సాగించిన రహస్య దోస్తీని ఇలాగే కొనసాగించినా, పూర్తిగా చేతులు కలిపినా.. పవన్ కల్యాణ్ నిస్సందేహంగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగానే మిగిలిపోవడం ఖాయం!