తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ టికెట్‌ను ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు, లోకేశ్‌లతో ఆయన పలుమార్లు చర్చించారు. చంద్రగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి ఈ దఫా వైసీపీ తరపున బరిలో ఉండనున్నారు. చెవిరెడ్డి తనయుడితో ఢీకొట్టాలంటే ఆర్థికంగా బలమైన నాయకుడిని దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా డాలర్స్ దివాకర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడనే పేరు దివాకర్‌కు వుంది. ఈయన చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె నివాసి. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కన బంధుత్వం బాగుంది. సహజంగానే డబ్బున్న వాళ్లకు చుట్టాలు ఎక్కువగా వుంటారు.
వ్యాపారవేత్త అయిన డాలర్స్‌కు రాజకీయాలపై మక్కువ. ఇంత కాలం పార్టీలకు అతీతంగా అభ్యర్థులకు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యంలో ఆయన కొంత వరకు కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వస్తున్నారాయన. ఇటీవల డాలర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. దీని వెనుక తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనేది ఆయన అనుమానం.
దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని తానంటే ఏంటో చూపాలనే పట్టుదల డాలర్స్ దివాకర్రెడ్డిలో పెరిగింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి సీటుపై ఆయన కన్నుపడింది. చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యులు నియోజక వర్గంలో విస్తృతంగా తిరుగుతున్నప్పటికీ, డబ్బు ఖర్చు పెట్టే దగ్గరికి వచ్చే సరికి వెనుకాడుతున్నారనే విమర్శ వుంది.
ఇలాగైతే చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఎదుర్కోలేమని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో పులివర్తి స్థానంలో మరో దీటైన అభ్యర్థిని బరిలో నిలపాలనే తలంపుతో దివాకర్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. టీడీపీ ఆశించిన స్థాయిలో ఖర్చు పెట్టేందుకు సిద్ధమని కూడా చంద్రబాబు, లోకేశ్‌లతో దివాకర్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది.
అయితే షెడ్యూల్ కు ముందే తనకు టికెట్ ఇవ్వడంపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ అధిష్టానానికి ఆయన కోరినట్లు సమాచారం. సమయం తక్కువగా వుండడం, నియోజక వర్గంలో అన్నీ మొదటి నుంచి చేసుకెళ్లాల్సి వుంటుందని చంద్రబాబు, లోకేశ్‌లకు దివాకర్ చెప్పినట్టు తెలిసింది. దివాకర్ వైపు చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏమవుతుందో చూడాలి.