జనసేన ఆవిర్భవించి పదేళ్లు అవుతున్నాయి. రాష్ట్రమంతా కాకపోయినా.. కనీసం గోదావరి జిల్లాల వరకూ అయినా ఆ పార్టీ తరఫున ఎదగాలనే తపనతో పని చేసిన వారు ఉన్నారు. వారు కాపులే కావొచ్చు! పవన్ మీద కులాభిమానంతోనే జనసేన వైపుకు వెళ్లి ఉండొచ్చు. ఏదైనా కావొచ్చు.. అయితే గ్రౌండ్ లెవల్ నుంచి ఎదగాలనే తపనతో పని చేసిన వారు, పవన్ ఇమేజ్ తో తాము కూడా రాజకీయంగా ఎదగాలనే ఆశ కావొచ్చు.. వీటితో పని చేసిన వారు కావొచ్చు.. ఇలాంటి వారు, కష్టపడ్డ వారు కనిపిస్తారు! అయితే 2024 ఎన్నికల నాటికి పవన్ కు ఇలాంటి వారి అవసరం లేకుండా పోయింది! ఇప్పుడు పవన్ కు రెడీమేడ్ నేతలు దొరుకుతున్నారు! చంద్రబాబు పంపిన వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్న వారు ఇప్పుడు పవన్ కు మేలనిపిస్తున్నారు!
నిడదవోలు నియోజకవర్గంలో పవన్ ను నమ్ముకుని ఒక యువకుడు పదేళ్లుగా ఇళ్లిళ్లూ తిరుగుతున్నాడు. అచ్చం పవన్ రీతినే జుట్టు పెంచి, గడ్డం పెంచి, ఇళ్లిళ్లూ తిరుగుతూ.. తనకున్న పరిచయాలతో జనసేన తరఫున పని చేస్తూ వచ్చాడు. సామాజికవర్గం కూడా కాపు! కులాభిమానం ఉంది, కులబాంధవుల పరిచయాలున్నాయి, పవన్ మీద వీరాభిమానం ఉంది, ఉత్సాహం ఉంది, తిరిగే శక్తి ఉంది, పదుల కోట్లు కాకపోయినా.. ఎన్నికలను ఎదుర్కొనడానికి ఆర్థికబలం కూడా ఉంది! జనసేన తరఫున తనకు అవకాశం దక్కుతుందని సదరు అభ్యర్థి వేయి కలలను కన్నాడు!
ఒకవేళ జనసేన తరఫున అలాంటి అభ్యర్థికి టికెట్ దక్కి ఉంటే.. ఆ పార్టీ కొత్త నేతను తయారు చేసినట్టుగా అయ్యేది! గెలుపోటములను పక్కన పెడితే.. కనీసం ఒక కాపు యువకుడిని జనసేన నేతగా ప్రమోట్ చేసేది. పవన్ కు ఇలాంటి కష్టపడే వారు దొరికితే.. ఆ పార్టీ కూడా క్షేత్ర స్థాయిలో ఈ పాటికే బలోపేతం అయ్యేది కూడా! అయితే సదరు యువకుడికి వచ్చిన క్లారిటీ ఏమిటంటే.. జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయదు, అలాంటి పరిస్థితుల్లో తనకు ఎలాంటి అవకాశం దక్కదూ అని! చంద్రబాబుతో సమావేశాలతో పవన్ ఎప్పుడో పొత్తు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి.. ఇక తనకు జనసేనలో అవకాశం దక్కదనే క్లారిటీ వచ్చింది. ఇక చేసేది లేక ఇండిపెండెంట్ గా మారాడు! తన మానాన తను పని చేసుకుంటూ ఉన్నాడు! జనసేన మీద వేయి ఆశలతో ఏడెనిమిదేళ్లు పని చేసినా కనీసం పోటీకి అవకాశమే లభించడం లేదు!
నిడదవోలులో కాపుల జనాభా గణనీయంగా ఉంటుంది, మరి రేపు జనసేన అక్కడ పోటీ చేసే అవకాశం ఉందా? అంటే, టీడీపీ ఆ అవకాశం ఇవ్వదు! ఒకవేళ జనసేన కు చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గాన్ని కేటాయించినా.. కింద నుంచి వచ్చిన జనసైనికుడికి ఎలాగూ అవకాశం దక్కదు! చంద్రబాబు చెప్పిన, ఆయన మెప్పు పొందిన వారెవరో జనసేనలోకి చేరి వారే అభ్యర్థి అవుతారు! ఒక్క నిడదవోలే కాదు.. రేపటి ఎన్నికలకు జనసేనకు చంద్రబాబు కేటాయించబోయే పదో పరక అన్ని సీట్లలోనూ ఇదే పరిస్థితే ఉంటుంది! జనసేన ద్వారా రాజకీయ కలలను కన్న వారికి ఎవ్వరికీ ఏ చిన్న అవకాశం కూడా దక్కదు! ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన తరఫున ఎదిగిన వారికి టికెట్ దక్కదు కూడా!
పవన్ కల్యాణ్ ఒక్కడే ఈ జాబితాలో ఉండవచ్చు, ఆయన అన్న నాగబాబు, నాదెండ్ల మనోహర్ లకు టికెట్ దక్కినా.. అది వేరే కోటా! ఇంతకు మించి జనసేన పోటీ చేసే ఒక్క చోట కూడా.. ఇతడు జనసేన నుంచి ఎదిగాడు, పవన్ కల్యాణ్ తయారు చేసుకుంటున్న నేత అని చెప్పుకోవడానికి ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా ఉండబోడని స్పష్టం అవుతోంది. ఇదీ పవన్ కల్యాణ్ పాతికేళ్ల రాజకీయ ప్రయాణంలో పదేళ్లు పూర్తి అయిన తర్వాతి పరిస్థితి!