వయసు మీదపడిన తర్వాత సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు రావడం సహజం. బాలీవుడ్ సీనియర్ నటుడు, 73 ఏళ్ల మిథున్ చక్రవర్తిపై కూడా అలాంటి పుకార్లు గుప్పుమన్నాయి.
ఈరోజు ఉదయం మిథున్ దాదాను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారట. ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆయన్ను కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిట్ లో జాయిన్ చేశారట. దీంతో బాలీవుడ్ మీడియా అలర్ట్ అయింది. వరుసగా కథనాలు ప్రసారం చేసింది.
కొద్దిసేపటి తర్వాత మిథున్ కొడుకు సీన్ లోకి వచ్చాడు. తన తండ్రి బాగానే ఉన్నాడంటూ ప్రకటన చేశాడు. మిథున్ చక్రవర్తి హాస్పిటల్ కు వెళ్లిన మాట నిజమేనని, కాకపోతే అది రెగ్యులర్ చెకప్ లో భాగమని ఆయన స్ఫష్టం చేశాడు.
హాస్పిటల్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఆయనకు ఎంఆర్ఐ తీశారట. కొన్ని రక్త పరీక్షలు చేశారట. ప్రస్తుతం న్యూరో స్పెషలిస్టుల పర్యవేక్షణలో మిథున్ ఉన్నారని తెలిపారు.
1980ల్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపారు మిథున్ చక్రవర్తి. 1989లో లీడ్ యాక్టర్ గా 19 సినిమాలు విడుదల చేసి బాలీవుడ్ లో రికార్డ్ నెలకొల్పారు. 90ల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి లెక్కలేనన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన సినిమాలు తగ్గించారు. గతేడాది ఒకేఒక్క సినిమా చేశారు. అది కూడా బెంగాలీ మూవీ.