కొత్త ఏడాదిలో భారీ నష్టాలు తెచ్చిన తొలి సినిమా

ప్రతి ఏటా బ్లాక్ బస్టర్లు ఉన్నట్టుగానే డిజాస్టర్లు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సూపర్ హిట్స్ కంటే అట్టర్ ఫ్లాపులే ఎక్కువ. ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్ తో మొదలైంది. సూపర్ హిట్…

ప్రతి ఏటా బ్లాక్ బస్టర్లు ఉన్నట్టుగానే డిజాస్టర్లు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సూపర్ హిట్స్ కంటే అట్టర్ ఫ్లాపులే ఎక్కువ. ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్ తో మొదలైంది. సూపర్ హిట్ అయి, రికార్డులు తిరగరాస్తుందనుకున్న ఫైటర్ సినిమా భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. 

హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేశారు. రిలీజైన మొదటి రోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. గణతంత్ర దినోత్సవం హాలిడే కారణంగా కాస్త ఊపందుకుంది. ఆ తర్వాత పడుతూ లేస్తూ సాగుతోంది.

నిన్నటితో 16 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు 189 కోట్ల రూపాయల నెట్ సాధించింది. 275 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఇండియాలో భారీ రేట్లకు అమ్మారు. కానీ ఇప్పటివరకు 189 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.

మరోవైపు దేశంలో ఫైటర్ సినిమాకు ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. నిన్నటి రోజున ఇండియాలో ఈ సినిమా కేవలం 13.97 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసింది. ఈరోజు రేపు మినహాయిస్తే, సోమవారం నుంచి ఈ సినిమా థియేటర్లలో నడవడం అసాధ్యమని తేలిపోయింది. దీంతో ఫైటర్ సినిమా కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు భారీగా నష్టాలు తప్పవని ట్రేడ్ అంచనా వేస్తోంది.

శుక్రవారం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా కేవలం కోటి 81 లక్షల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు 300 కోట్ల రూపాయల గ్రాస్ దాటినప్పటికీ సినిమా భారీగా నష్టాలు మిగల్చడం ఖాయమని తేలిపోయింది.