కేంద్రంలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిందనుకున్న ఇండియా కూటమి ఎన్నికల వరకూ వచ్చే సరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా సాగుతూ ఉంది! ఈ కూటమిలో పార్టీలకు బలం ఉన్న రాష్ట్రాలు కొన్ని అలాంటి చోట వీటి మధ్యన ఎలా పొత్తు కుదురుతుందనే డౌట్ మొదట్నుంచి అందర్లోనూ ఉంది. ఎన్నికల సమయానికి అదే జరుగుతోంది!
ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సీట్ల ఒప్పందం లేదని బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ప్రకటించేశారు! ఆమె కూటమిలోంచి బయటకు వెళ్లినట్టుగా ప్రకటించకపోయినా, కాంగ్రెస్- కమ్యూనిస్టులతో సీట్ల పంచుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు!
ఇక ఢిల్లీలో, పంజాబ్ లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు సీట్ల ఒప్పందం లేదని స్పష్టం చేస్తోంది! పంజాబ్ లో కాంగ్రెస్ తో సీట్లను పంచుకోవడానికి పార్టీ క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి లేదని ఆప్ అంటోంది! ఇలా రెండు కీలక రాష్ట్రాల్లో ఈ కూటమిలో సీట్ల ఒప్పందాలు లేవని స్పష్టం అవుతోంది.
ఇక యూపీలో కాంగ్రెస్ ది తోక పాత్రే! కాబట్టి అక్కడ ఎస్పీ ఎన్నో కొన్ని సీట్లు కేటాయించవచ్చు! మహారాష్ట్రలో వీరి మధ్యన రచ్చ కొనసాగుతూ ఉంది. శివసేన డిమాండ్ గట్టిగా ఉందక్కడ! శివసేన తను పోటీ చేయదలుచుకున్న సీట్ల నంబర్ ను చెబుతోంది. మరి కాంగ్రెస్, ఎన్సీపీలు ఆ నంబర్ కు ఏ మేరకు ఓకే చెబుతాయో చూడాల్సి ఉంది!
మహారాష్ట్రలో కూటమి అంతా బాగుందని, ఒకవైపు ఉద్ధవ్ సేన అంటూనే, మరోవైపు తను పోటీ చేయాలనుకున్న సీట్లన్ని తమకే అని తనే ప్రకటించేస్తోంది! దీనిపై కాంగ్రెస్, ఎన్సీపీ గట్టిగా మాట్లాడలేకపోతున్నట్టుగా ఉన్నాయి. ఎన్సీపీ కూడా చీలింది కాబట్టి.. శివసేన ఇప్పుడు మరింతగా హల్చల్ చేయవచ్చు!
బీజేపీ గట్టిగా ఉన్న చోట ఇండియా కూటమిలో ఉన్న ఏ పార్టీకీ పోటీపడే సత్తా కనిపించడం లేదు, అందరి బలం కొన్ని రాష్ట్రాల్లోనే ఉండటంతో అక్కడ మాత్రం రచ్చ రాజుకుని, ఎవరికి వారే అని ప్రకటించుకున్నారు! ఇదీ ఇండియా కూటమి పరిస్థితి!