పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పొత్తుల పుణ్యమా అని రాజమండ్రి రూరల్ సీటు తనకు దక్కుతుందో, లేదో అనే భయం పట్టుకుంది. అలాగని చంద్రబాబుపై విమర్శలు చేయలేక, రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టాలనే బెంగతో బుచ్చయ్య మానసికంగా కుంగిపోతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తన పార్టీ నాయకులకు ఓ పిలుపునిచ్చారు.
పొత్తులో భాగంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులే త్యాగాలకు సిద్ధం కావాల్సి వుంటుందని ఆవేదనతో చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన అంత బలంగా లేని విషయాన్ని, అలాగే గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల శాతాన్ని ఆయన చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనసేన కేడర్ ఇంకా బలపడాల్సి వుందని బుచ్చయ్య చెప్పడం ద్వారా… ఆ పార్టీకి అంత సీన్ లేదనే మనసులో మాటను పరోక్షంగా అలా చెప్పారు.
రాజమండ్రి రూరల్ సీటును బుచ్చయ్యకు కాకుండా, జనసేన ఇన్‌చార్జ్ కందుల దుర్గేశ్‌కు ఇస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి రూరల్‌లో తానే పోటీ చేస్తానని దుర్గేశ్ పదేపదే చెప్పడాన్ని బుచ్చయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు రాజమండ్రి రూరల్ సీటు తేల్చడానికి దుర్గేశ్ ఎవరని ఆయన నిలదీసిన సంగతి తెలిసిందే. త్యాగాలకు సిద్ధపడాలనే పిలుపు ఇవ్వడం ద్వారా బుచ్చయ్య మెత్తబడ్డారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే… గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారని బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి అరశాతం ఓట్లు వచ్చాయని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ లెక్కన బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వొద్దు. అరశాతం ఓట్లు కూడా బీజేపీ చెంతకు చంద్రబాబు కాళ్ల బేరానికి ఎందుకెళ్లాడో తెలియకుండానే బుచ్చయ్య మాట్లాడేంత అమాయకుడు అనుకోవాలా? బీజేపీతో పొత్తు కుదుర్చుకోడానికి కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చూసే తప్ప, ఏపీలో బలం చూసి కాదని బుచ్చయ్యకు తెలియదా? అనేది ప్రశ్న.
ఏది ఏమైనా పొత్తుల కోసం అంతిమంగా టీడీపీ త్యాగాలకు సిద్ధం కావాలనేది బుచ్చయ్య మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం. ఆ త్యాగం ఎన్ని సీట్లు అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.