ష‌ర్మిల రాక‌తో ఇదేనా కాంగ్రెస్‌కు ఊపు!

వైఎస్సార్ కుమార్తె ష‌ర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సార‌థ్యం వ‌హిస్తుండ‌డంతో, ఆ పార్టీకి ఊపు వ‌చ్చింద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. అయితే ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తామ‌ని వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను చూస్తే……

వైఎస్సార్ కుమార్తె ష‌ర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సార‌థ్యం వ‌హిస్తుండ‌డంతో, ఆ పార్టీకి ఊపు వ‌చ్చింద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. అయితే ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తామ‌ని వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను చూస్తే… కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిల వ‌ల్ల వ‌చ్చిన ఆద‌ర‌ణ ఏమీ లేద‌నే వాళ్లే సంఖ్యే ఎక్కువ‌.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకునే ఆశావ‌హుల నుంచి ఆ పార్టీ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 175 అసెంబ్లీ స్థానాల నుంచి 793 మంది, అలాగే 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి 105 మంది మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ద‌ర‌ఖాస్తు గ‌డువును ఈ నెలాఖ‌రు (ఫిబ్ర‌వ‌రి 29) వ‌ర‌కు పొడిగించిన‌ట్టు ఆ పార్టీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి న‌లుగురు చొప్పున ద‌ర‌ఖాస్తులు వేసిన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి.

నిజంగా కాంగ్రెస్‌కు జ‌నంలో ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ట్టైతే పోటీ కూడా బాగా వుండాలి. ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ద‌ర‌ఖాస్తే క‌దా, ప‌డేద్దామ‌ని అనుకునే వాళ్లే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు తెలిపారు.

ఏపీ కాంగ్రెస్ సార‌థిగా ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్ష‌ణం నుంచి త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ టార్గెట్‌గా రాజ‌కీయాలు చేస్తున్నారు. అన్న ప్ర‌భుత్వంపై ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ-జ‌న‌సేన‌ల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌లిగించేందుకే ష‌ర్మిల త‌న అన్న ప్ర‌భుత్వంపై ఘాటు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దీంతో ఆమె మాట‌ల‌కు జ‌నం నుంచి పెద్ద‌గా రెస్పాన్స్ రావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

వ్య‌క్తిగ‌త విభేదాల‌తో జ‌గ‌న్‌పై అన‌వ‌స‌రంగా రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని సామాన్య ప్ర‌జానీకం కూడా ష‌ర్మిల‌ను త‌ప్పు ప‌డుతున్నారు. అందుకే ష‌ర్మిల నేతృత్వం వ‌హించిన‌ప్ప‌టికీ కాంగ్రెస్‌కు ఏపీలో అంత సీన్ లేద‌నే త‌లంపుతో పోటీ చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.ఇంత‌కూ ష‌ర్మిల పోటీపై క్లారిటీ ఇచ్చారా? లేదా? అనేది ప్ర‌శ్న‌.