తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టుగా పచ్చమీడియానే చెబుతోంది. పొత్తు చర్చల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినట్టుగా ఆస్థాన మీడియానే చెబుతోంది. అది కూడా బీజేపీ పిలుపు మేరకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినట్టుగా చెబుతోంది. మరి అంతా బాగానే ఉంది కానీ, ఢిల్లీ నుంచి తనకు పిలుపు వచ్చిన తర్వాత, తను వెళ్లి బీజేపీ ముఖ్య నేతలతో పొత్తు చర్చలు చేసిన తర్వాత.. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టకపోవడమే ఇక్కడ గమనించదగిన అంశంగా మారింది!
ప్రెస్ కనిపిస్తే గంటలు గంటలు ప్రసంగించే చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో చర్చల్లో ఏ మాత్రం సానుకూలత ఉన్నా.. అక్కడక్కడ జాతినుద్దేశించి ప్రసంగించేవారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం- బీజేపీ పొత్దు దేశానికి ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గంటల కొద్దీ వివరించి చెప్పే వారు ఢిల్లీలోనే! మోడీని పొగుడుతూ, అమిత్ షాను కీర్తిస్తూ చంద్రబాబు నాయుడు ప్రసంగాలు జరిగేవి! అయితే.. భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు కామ్ గా వచ్చేశారు!
అక్కడ కట్ చేస్తే.. తమతో కొత్త మిత్రులు కలిసి వస్తారంటూ ప్రకటించిన అమిత్ షా కూడా పొత్తు వ్యవహారంగాపై నర్మగర్భంగానే మాట్లాడారు. తెలుగుదేశంతో పొత్తు ఖరారు అయినట్టుగా కూడా అమిత్ షా ప్రకటించేయలేదు!
మరి ఈ రెండు సీన్లనూ కలిపి చూస్తే.. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ముందు బీజేపీ హైకమాండ్ పెద్ద ప్రపోజలే పెట్టింది! ఆ ప్రతిపాదనకు చంద్రబాబు నాయుడు టక్కున ఊకొట్టలేని రేంజ్ లో ఆ ప్రతిపాదన ఉందని ఆయన ఢిల్లీ కామ్ గా రావడంతోనే క్లారిటీ వచ్చింది.
తాము పెట్టిన ప్రపోజల్ కు చంద్రబాబు నాయుడు కాదని అనడనే ధీమా ఇప్పుడు అమిత్ షా మాటల్లో వ్యక్తం అవుతోంది! మరి పదికి పైగా ఎంపీ సీట్లను బీజేపీ అడిగిందా, లేక ఇంతకు మించి షాకింగ్ ప్రపోజల్ ఏమైనా కమలం పార్టీ చంద్రబాబు ముందు పెట్టిందా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కలవరం కలిగించేలా ఉంది!
బీజేపీ పెట్టిన ప్రతిపాదన పట్ల చంద్రబాబు నాయుడు తర్జనభర్జనలు పడుతున్నారని స్పష్టం అవుతోంది. ఈ తర్జనభర్జనల్లో ఆయనకు పవన్ కల్యాణే తోడున్నాడు! ఒకవేళ బీజేపీ గట్టిగా సీట్లను అడిగి ఉంటే.. పవన్ కల్యాణ్ కూడా తన కోటాలోని పదో ఇరవై సీట్లలో కూడా కొంత త్యాగం చేయాల్సి ఉంటుందేమో!