గతంలో తన తండ్రి వైఎస్సార్ రచ్చబండ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నట్టే, తాను కూడా అదే విధానాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అనుసరిస్తున్నారు. రచ్చబండ వేదికగా తన అన్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శలతో బండకేసి బాదుతూ, ప్రతిపక్షాలకు, వాటిని మోస్తున్న మీడియా యజమానులకు ఆనందాన్ని పంచాలని షర్మిల ఉవ్విళ్లూరుతున్నారనే ఆరోపణ వుంది.
ఈ నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో శనివారం నిర్వహించిన రచ్చబండ వేదిక… షర్మిలకు షాక్ ఇచ్చింది. ఈ వేదికలో వైఎస్సార్ అభిమాని అయిన ఒక వ్యక్తి మాట్లాడుతూ గతంలో మీ మాటలు వినే, కాంగ్రెస్‌ను వీడి, వైసీపీ జెండా మోస్తున్నామని అన్నారు. నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆరోపించి, ఇప్పుడు అదే పార్టీ కండువా కప్పుకుని జగన్‌ను విమర్శించడం ఏంటని నిలదీసి… షర్మిలను రాజకీయంగా బండకేసి బాదారు.
సదరు వైఎస్సార్ అభిమాని మాట్లాడుతూ షర్మిలను నిలదీస్తుంటే, ఆయన మైక్‌ను లాక్కోవాలని ప్రయత్నించారంటే ఏ రేంజ్‌లో నిలదీశారో అర్థం చేసుకోవచ్చు. షర్మిల పక్కనే రఘువీరారెడ్డి కూడా ఉన్న రచ్చబండ కార్యక్రమంలో ఆ అభిమాని ఏం మాట్లాడారో తెలుసుకుందాం.
వైఎస్సార్ చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అన్యాయం జరిగిందని వైసీపీ జెండాను భుజాన వేసుకుని మీ పాదయాత్రలో తిరిగామన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు వైసీపీ జెండాతో తిరిగామని గుర్తు చేశారాయన. మీరు ఏది చెబితే దాని కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డామని సదరు అభిమాని షర్మిలతో అన్నారు. జగనన్న జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారన్నారు.
మీ మాటల్ని విని వైఎస్సార్ కుటుంబానికే ఇంత అన్యాయం జరిగితే, మన పరిస్థితి ఏంటని ఆలోచించామన్నారు. ప్రతి కాంగ్రెస్ కుటుంబం వైఎస్సార్ కుటుంబం అయ్యింది కేవలం మీ మాటల వల్లే అని అతను చెప్పారు. అప్పటి నుంచి ఆ జెండానే మోస్తున్నామన్నారు. మీరు చెప్పిందే చేస్తున్నామన్నారు. జగన్ పరిపాలనలో పేదవాళ్లంతా సుభిక్షంగా ఉన్నారని ప్రశంసించారు. పింఛన్లు వస్తున్నాయని, సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని షర్మిల విమర్శలకు ఓ సామాన్యుడు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు. అతని చెప్పిన ప్రతిదానికి సమాధానం ఇస్తానని, మాట్లాడనివ్వాలని అతన్ని అడ్డుకున్న తన పార్టీ కార్యకర్తలతో షర్మిల అనడం గమనార్హం.