సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీలోకి క్యూ కడుతున్నాయి. ముందుగా సైంధవ్ సినిమా వచ్చేసింది. థియేటర్లలో ఫ్లాప్ అయినట్టుగానే ఓటీటీలో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది.
సైంధవ్ తర్వాత గుంటూరుకారం సినిమా వచ్చింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది. ఇప్పుడు నా సామిరంగ వంతు వచ్చింది.
నాగార్జున నటించిన సంక్రాంతి మూవీ నా సామిరంగ. సంక్రాంతి చిత్రాల్లో చివరగా రిలీజైన ఈ మూవీ, బ్రేక్-ఈవెన్ అయింది. రెవన్యూ పరంగా చూసుకుంటే నాగార్జునకు సక్సెస్ తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అడుగు పెడుతోంది.
నా సామిరంగ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఈనెల 17 నుంచి, అంటే వచ్చే శనివారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.
కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కీరవాణి పాటలు క్లిక్ అవ్వనప్పటికీ, కంటెంట్ కాస్త రొటీన్ గా ఉన్నప్పటికీ, కట్టుదిట్టమైన బడ్జెట్ లో తీయడం, సంక్రాంతి సీజన్ కలిసిరావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది. నాగార్జున చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ను అందించింది.
సంక్రాంతి సినిమాల్లో ఇక మిగిలింది హను-మాన్ మాత్రమే. లెక్కప్రకారం ఈ సినిమా కూడా జీ5లో వచ్చేయాలి. కానీ అగ్రిమెంట్ మార్చారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది.