చంద్రబాబుకు, 23 నంబర్ తో ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ లింక్ గురించి తెలుసు. ఇప్పుడీ సెంటిమెంట్ ను మరో గుర్తు చేస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దీనికి ఓ కారణం ఉంది.
ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. మరీ ముఖ్యంగా లోకేష్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కోర్టు వరకు వెళ్లారు. అయినప్పటికీ ఫలితం లేదు. వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
అయితే ఇక్కడ మేటర్ అది కాదు. ఈ సినిమా 23వ తేదీన విడుదలవుతోంది. అది ఇప్పుడు హాట్ టాపిక్. వ్యూహం సినిమా ఈనెల 23న రిలీజ్ అవుతున్న సందర్భంగా, మరోసారి చంద్రబాబు చుట్టూ అల్లుకున్న '23 సెంటిమెంట్'ను బయటకు తీశాడు ఆర్జీవీ.
వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న 23 ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి, ఎన్నికల్లో బాబుకు 23 సీట్లు మాత్రమే వచ్చిన అంశం వరకు, చివరికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయిన తేదీని కూడా ప్రస్తావిస్తూ.. టీజ్ చేశాడు.
అలా 23 అనే సంఖ్య చంద్రబాబును ఎంత ఇబ్బందిపెట్టిందో ఏకరువు పెడుతూ.. తన వ్యూహం కూడా 23వ తేదీకే వస్తోందని గుర్తుచేశాడు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు దగ్గరగా ఉన్న థియేటర్లలో వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందంటూ ఇప్పటికే టీజింగ్ షురూ చేసిన ఆర్జీవీ.. ఈ '23' నంబర్ తో టీజింగ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు.