ఏపీలో టీడీపీతో పొత్తుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక కామెంట్స్ చేశారు. పొత్తు వుంటుందని పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఇటీవల అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించిన సంగతి తెలిసిందే.
బీజేపీతో పొత్తు కోసం బాబు ఢిల్లీ వెళ్లారనేది బహిరంగ రహస్యమే. అయితే బీజేపీతో జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబు బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో పొత్తు త్వరలో కొలిక్కి వస్తుందన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్‌షా చెప్పుకొచ్చారు.
ఎంత పెద్ద కూటమి వుంటే అంత మంచిదని భావిస్తున్నట్టు అమిత్‌షా తెలిపారు. తమ మిత్రులను తామెప్పుడూ బయటికి పంపలేదని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ టీడీపీని దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఎన్డీఏ నుంచి బయటికొచ్చింది చంద్రబాబే. నాడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ట్రాప్‌లో పడి ఎన్డీఏ నుంచి బయటికి వెళుతున్నారని చంద్రబాబును ప్రధాని మోదీ హెచ్చరించారు.
అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు విభజిత రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వుందనే భయంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందనే సానుకూల వాతావరణం కనిపిస్తుండడంతో చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరడానికి రెడీ అయ్యారు.
ఇటీవల చర్చల్లో కూడా సానుకూలత కనిపించడం వల్లే బాబు రాకను దృష్టిలో పెట్టుకుని అమిత్‌షా పొత్తుపై ఆ కామెంట్స్ చేశారని అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే అంశంపై అందరి దృష్టి వుంది.