ఎప్పటికీ విలన్ రోల్స్ చేయను

కథ బాగుంటే, క్యారెక్టర్ నచ్చితే విలన్ రోల్స్ చేస్తానని చెబుతుంటారు కొంతమంది హీరోలు. హీరో సందీప్ కిషన్ మాత్రం అస్సలు విలన్ గా నటించనంటున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఓసారి విలన్ గా కనిపించిన…

కథ బాగుంటే, క్యారెక్టర్ నచ్చితే విలన్ రోల్స్ చేస్తానని చెబుతుంటారు కొంతమంది హీరోలు. హీరో సందీప్ కిషన్ మాత్రం అస్సలు విలన్ గా నటించనంటున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఓసారి విలన్ గా కనిపించిన ఈ నటుడు, ఇకపై అలాంటి పాత్రలు చేయనని క్లియర్ గా చెప్పేశాడు.

“తెలుగు సినిమాల్లో విలన్ గా నటించమని చాలామంది అడుగుతున్నారు. తెలుగు సినిమాలోనే కాదు, అసలు ఏ భాషలోనూ నేను విలన్ గా చేయను. నాకు విలన్ గా చేసే ఆసక్తి లేదు. విలన్ గా చేయడం నా మనసుకు నచ్చడం లేదు. బ్యాడ్ గయ్ గా నన్ను నేను తెరపై చూసుకోవాలని అనుకోవడం లేదు. నాకే ఇష్టం లేనప్పుడు, ఆడియన్స్ కు ఎందుకు విలన్ గా కనిపించాలి. బహుశా, ఆ సినిమా ప్రత్యేకమైనదై, విలన్ పాత్ర కూడా కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసిందైతే చేస్తానేమో. అంతే తప్ప రెగ్యులర్ విలన్ గా కనిపించే ఆసక్తి లేదు.”

తమిళ నటుడు ధనుష్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. ఆ సినిమాలో సందీప్ విలన్ గా కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. దీనిపై స్పందిస్తూ, తనకు విలన్ పాత్రలపై ఇంట్రెస్ట్ లేదని ప్రకటించాడు సందీప్. ధనుష్ దర్శకత్వంలో సినిమా పూర్తయిందని, త్వరలోనే వివరాలు బయటకొస్తాయని చెబుతున్నాడు.

సలార్ పార్ట్-2లో కూడా నెగెటివ్ షేడ్ లో కనిపించే పాత్ర పోషిస్తున్నాడంటూ వచ్చిన వార్తల్ని కొట్టిపడేశాడు. సలార్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.