ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అత్యంత శక్తిమంతుడు. ఆయనకు తెలియకుండా చీమైనా కుట్టదని వైసీపీ నేతలు అంటుంటారు. సీఎం జగన్ కేబినెట్ నుంచి తప్పించినప్పటి నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాట నిజం. అలాగని ఆయనకు ప్రభుత్వంలో పలుకుబడి లేదనుకోవడం నిజం కాదు. బాలినేనిని సీఎం జగన్ చాలా అభిమానిస్తారు. అందుకే బాలినేని ఎన్నోసార్లు ప్రభుత్వానికి, పార్టీకి నష్టం వచ్చేలా మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న మాట వాస్తవం.
ఈ నేపథ్యంలో బాలినేని పొలిటికల్ పవర్‌కు చెక్ పెట్టే పవర్ ఒకటి కొత్తగా వచ్చినట్టు ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతోంది. ఆ పవర్ ఎవరు? అనే ఆరా తీయడం ఎక్కువైంది. బాలినేనికి తెలియకుండా ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ను తిరుపతికి బదిలీ చేయడం, అక్కడి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని ఆమె స్థానానికి తీసుకెళ్లడం వెనుక బలమైన అదృశ్య శక్తి పని చేసిందనే మాట వినిపిస్తోంది. ఈ బదిలీలపై బాలినేని తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారని సమాచారం. ఇలాగైతే రాజకీయాల్లో తాము వుండాలా? వద్దా? అని వైసీపీ పెద్దల్ని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈ బదిలీల తెర వెనుక అసలేం జరిగిందని ఆరా తీయగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలియకుండానే తిరుపతి, ఒంగోలు ఎస్పీల బదిలీలు జరిగాయని సమాచారం. ఈ బదిలీలపై ఇటు సొంత పార్టీ , అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రిలీవ్ కావద్దని తిరుపతి, ఒంగోలు ఎస్పీలకు సమాచారం వెళ్లినట్టు తెలిసింది. అందుకే వాళ్లిద్దరూ తమ విధుల నుంచి రిలీవ్ కాలేదని సమాచారం.
ఒంగోలులో తనకు తెలియకుండా కొత్త ఎస్పీని తీసుకురావడం ఏంటని బాలినేని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించినట్టు సమాచారం. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ నిరాకరించడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థులపై కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. వారిని బాలినేని వ్యతిరేకిస్తున్నారని వార్తలొచ్చాయి. పుండుమీద కారం చల్లిన చందంగా, ఇప్పుడు ఎస్పీ బదిలీలు తనకు తెలియకుండా చేశారని బాలినేని ఫైర్ అవుతున్నారు.
రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎలా వుంటాయో… తాజా పరిణామాలు జస్ట్ ట్రైల్ మాత్రమే. అసలు సినిమా వేరే లెవల్లో వుంటుందని ట్రైలరే చెబుతోందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.