బీజేపీతో పొత్తు అంటే ఉక్కు పోటు!

బీజేపీతో పొత్తుకు టీడీపీ సిద్ధం అవుతోంది అన్న వార్తల నేపధ్యంలో విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణలలో తేడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ…

బీజేపీతో పొత్తుకు టీడీపీ సిద్ధం అవుతోంది అన్న వార్తల నేపధ్యంలో విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణలలో తేడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ నిర్ణయించి ఈ రోజుకు అక్షరాలా 1093 రోజులు గ‌డిచాయి. ఉద్యమాలను అన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు.

విశాఖ ఉక్కు కోసం అలుపెరగని పోరాటం సాగుతోంది. ఉక్కు ఉద్యమకారుల పోరాటం గొంతు పెద్దదిగా వినిపించకపోవచ్చు కానీ ఆ వేడి మాత్రం అలాగే ఉంది. దాన్ని మూడేళ్ళుగా అలాగే ఉంచగలిగారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీకి ఓటుతోనే జవాబు చెప్పాలని ఉక్కు కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

ఇపుడు బీజేపీతో పొత్తుతో టీడీపీ ముందుకు వస్తే ఆ పార్టీ మీద కూడా ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. విశాఖలో నాలుగైదు నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉక్కు పోరాటం ఉంది. బీజేపీకి చూస్తే ఏపీలో పెద్దగా బలం లేదు. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే టీడీపీకి విశాఖలో బాగానే బలం ఉంది.

ఆ పార్టీ కనుక కమలంతో కరచాలనం చేస్తే ఇప్పటిదాకా కనిపించిన గెలుపు ధీమా సడలిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఈలోగా కేంద్రం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటే ఏమో కానీ లేని పక్షంలో దెబ్బ పడేది బీజేపీకి కాదు టీడీపీకే అంటున్నారు

విశాఖ సిటీలో టీడీపీ 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచి నాలుగు సీట్లను గెలుచుకుంది. అయితే ఇపుడు పొత్తు రాజకీయాల మూలంగా పితలాటకం మొదలైతే మాత్రం అది పసుపు పార్టీకే ఎరుపు సిగ్నల్ చూపించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.