కంచుకోటను టీడీపీ వదులుకున్నట్లేనా?

తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో అనేక ఎన్నికలలో వరసగా గెలుస్తూ పసుపు జెండాను ఆ పార్టీ ఎగరేస్తూ వస్తోంది. ఎలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ…

తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో అనేక ఎన్నికలలో వరసగా గెలుస్తూ పసుపు జెండాను ఆ పార్టీ ఎగరేస్తూ వస్తోంది. ఎలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటిదాకా తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు గెలిచింది.

అలాంటి సీటులో జగన్ ప్రభంజనం వీచి 2019లో వైసీపీ తొలిసారి జెండా ఎగరేసింది. ఈ రోజుకీ వైసీపీ అక్కడ బలంగా ఉంది. ఈ సీటుని జనసేన ఆశిస్తోంది. ఆ పార్టీ తరఫున 2019లో పోటీ చేసిన సుందరపు విజయకుమార్ కి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 68 వేల ఓట్లు వచ్చాయి.

అంటే మూడింతలు ఎక్కువ అన్న మాట. అలాంటి సీటుని జనసేన కోరుతోంది. పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. దీంతో ఎలమంచిలి తమ్ముళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న పప్పల చలపతిరావు వంటి వారు ఎలమంచిలిలో నాలుగు సార్లు వరసగా గెలిచి టీడీపీ జెండా ఎగరేశారు.

విశాఖ జెడ్పీ మాజీ చైర్మన్ లాలం భవానీతో పాటు టీడీపీ నేతలు ఎలమంచిలి టికెట్ ని ఆశిస్తున్నారు. అయితే ఈ సీటుని జనసేనకు ఇస్తే కనుక టీడీపీ పట్టు జారిపోతుందని వారు అంటున్నారు. అధినాయకత్వం మాత్రం జనసేనకే సీటు అంటోంది. జనసేన అధినేతకు సుందరపు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఈ సీటుని కేటాయిస్తున్నారు అని తెలుస్తోంది.

ఒకసారి కనుక సీటు చేజారితే మాత్రం మళ్లీ టీడీపీ ఇక్కడ జెండా పాతడం కష్టం అని తలపండిన తమ్ముళ్ళు చెబుతున్నారు. టీడీపీకు బలమైన సీట్లకే జనసేన గురి పెట్టడంతో పొత్తులలో కొన్ని అయినా ఇవ్వక తప్పని అనివార్యత ఉందని అంటున్నారు. అయితే సీట్లు ఇవ్వడం కాదు ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగినపుడే పొత్తు ఫలించినట్లు అంటున్నారు. ఎలమంచిలిలో ఈ పొత్తు రాజకీయాన్ని వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది.