రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటును దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా సరే.. ఎన్నికల్లో పోటీకి దిగడం తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటు. ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం వారికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా.. తమ పార్టీ తరఫున నాలుగో అభ్యర్థిని బరిలోకి దించడానికి తెలుగుదేశం కుట్రరచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగుదేశం కుట్రలు ఫలించకుండా చాలా పటిష్టమైన వ్యూహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో నెగ్గాలంటే.. ఒక్కో ఎంపీ అభ్యర్థికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. శాసనసభలో సంపూర్ణమైన బలాన్ని కలిగిఉన్న అధికార పార్టీ నుంచి వైవీ సుబ్బారెడ్ది, మేడా రఘునాధరెడ్డి, గొల్లబాబూరావు పోటీచేస్తున్నారు. తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డదారులు వెతుకుతూ నాలుగో అభ్యర్థిని పోటీకి దింపడం గురించి ఆలోచిస్తున్నది గానీ.. అవకాశం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రలు వర్కవుట్ అయినట్టుగా ఏమైనా ఊహించని లాభం ఉంటుందేమో అనేది తెలుగుదేశం కోరిక.
వైఎస్సార్ కాంగ్రెస్ కు సభలో 151 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశానికి ఓటు వేసిన వారిపై రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లోగా అనర్హత వేటు పడితే గనుక.. ఆ సంఖ్య తగ్గుతుంది గానీ.. తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి ఫిరాయించి వచ్చి జగన్ పంచన చేరిన వారితో కలుపుకుంటే బలం స్థిరంగానే ఉంటుంది.
ఒక్కొక్కరికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సి ఉండగా.. మొత్తం 132 ఎమ్మెల్యే సీట్లు సరిపోతాయి. ఆ రకంగా చూస్తే పార్టీ చాలా చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నట్టు లెక్క. కానీ తెలుగుదేశం కుట్రలు వేరు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో ప్రస్తుతం జగన్ చేస్తున్న మార్పుచేర్పుల వలన కొందరు అసంతృప్తికి గురవుతున్నారు. ఇలాంటి వారి ఓట్లన్నీ తమకు పడతాయని చంద్రబాబు ఆశ. నలుగురైదుగురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉండే మాట నిజమే కావొచ్చు గానీ.. ఆ మాత్రం ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినంత మాత్రాన తెలుగుదేశం నెగ్గుతుందని అనుకోవడం భ్రమ.
ఏది ఏమైనా సరే.. తెలుగుదేశం కుట్రలు ఫలించకుండా ఉండేందుకు వైఎస్ జగన్ తమ పార్టీ తరఫున బరిలో దిగుతున్న ఒక్కో అభ్యర్థికి కనీసం 44 ఓట్లు దక్కేలా తమ పార్టీ ఎమ్మెల్యేల విభజన చేస్తున్నారు. ఈక్రమంలో వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అసంతృప్తితో ఉన్నవారు, అలిగే వారు, క్రాస్ ఓటింగ్ చేసే వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా.. పార్టీకి పూర్తి విధేయులుగా ఉండేవారిని మాత్రమే 44 జాబితాలో రాస్తున్నారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు పట్టుమని పది మంది కూడా లేకపోగా.. అలాంటి వారి ఓట్లు దక్కుతాయనే ఆశతో రాజ్యసభ బరిలోకి దిగాలని తెలుగుదేశం భావిస్తే వారికి తలబొప్పి కడుతుందని ప్రజలు అంటున్నారు.