టీడీపీకి అనుకూల స‌ర్వేపై జ‌న‌సేన అనుమానం!

టీడీపీకి అనుకూల‌మైన ‘ఇండియా టుడే’ స‌ర్వే ఫ‌లితాల‌ను ఎల్లో మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. టీడీపీ 45 శాతం ఓట్ల‌తో 17 ఎంపీ, వైసీపీ 41.1శాతం ఓట్ల‌తో 8 సీట్ల‌ను ద‌క్కించుకుంటుంద‌నేది ఆ స‌ర్వే…

టీడీపీకి అనుకూల‌మైన ‘ఇండియా టుడే’ స‌ర్వే ఫ‌లితాల‌ను ఎల్లో మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. టీడీపీ 45 శాతం ఓట్ల‌తో 17 ఎంపీ, వైసీపీ 41.1శాతం ఓట్ల‌తో 8 సీట్ల‌ను ద‌క్కించుకుంటుంద‌నేది ఆ స‌ర్వే రిపోర్ట్ చెబుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏ మాత్రం ఎదుగూబొదుగూ లేని పార్టీ జ‌న‌సేనే అని స‌ద‌రు స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై వైసీపీ విమ‌ర్శ‌ల్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. ఏపీలోని ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా వైసీపీని తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైసీపీపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వుంద‌ని వారు చేస్తున్న విమ‌ర్శ‌ల్లో నిజం వుంటే, మరి 41.1 శాతం ఓటు బ్యాంక్ ఎలా వ‌చ్చింద‌నేది ప్ర‌శ్న‌. ఎనిమిది ఎంపీ సీట్లను వైసీపీ ద‌క్కించుకుంటుందంటే… 2019లో టీడీపీ ఘోర ప‌రాజ‌యంతో పోలిస్తే, వైసీపీ ఏమంత భ‌య‌ప‌డాల్సిన ద‌య‌నీయ స్థితిలో లేద‌ని అర్థ‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుచుకున్న ఎంపీ స్థానాలు మూడు మాత్ర‌మే.

ఈ స‌ర్వే ఫ‌లితాలు టీడీపీకి ఆనందాన్ని ఇస్తుండ‌గా, జ‌న‌సేన‌కు మాత్రం కోపం తెప్పిస్తున్నాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు  6.84 శాతం ఓట్లు ద‌క్కాయి. ఇప్పుడు 7 శాతం ఓట్లు వ‌స్తున్న‌ట్టుగా బాబు అనుకూల మీడియా అంచ‌నా వేసింది. ఇండియా టుడే స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం ఈ  ఐదేళ్ల‌లో వైసీపీ 8 శాతం ఓట్లు పోగొట్టుకుంది. టీడీపీకి పెరిగిన ఓట్లు 5 శాతం. జ‌న‌సేన‌కు ఏ మాత్రం ఓట్లు పెర‌గ‌లేదు. అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి.

ఐదేళ్లుగా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌ని, ఓట్ల‌ను పెంచుకోని జ‌న‌సేన‌తో టీడీపీ ఎందుకు అంట‌కాగుతుందో స‌మాధానం ఎవ‌రు చెప్పాలి? జ‌న‌సేన ఎంతోకొంత ఎద‌గ‌లేదని స‌ర్వే చెబుతున్న‌దంటే … ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై అనుమానాలు అందుకే. ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై జ‌న‌సేన గుర్రుగా వుంది. ఇదంతా మైండ్ గేమ్ అని జ‌న‌సేన నేత‌లు వాపోతున్నారు.

‘ఇండియా టుడే’ స‌ర్వేలో టీడీపీకి అనుకూలం వుంద‌ని చెప్ప‌డం వ‌ర‌కు ఓకే, మ‌రి ఆ పార్టీ పార్ట‌న‌ర్ జ‌న‌సేనకు అంత సీన్ లేద‌న‌డంపై ఏమంటారు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. స‌ర్వేపై వైసీపీ మాత్ర‌మే కాదు, టీడీపీ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన కూడా ఆగ్ర‌హంగా వుందంటే… దీని విశ్వ‌స‌నీయ‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.