బాబు క‌ష్టం.. ప‌గ వారికీ వ‌ద్దు!

చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ క‌ష్టం ప‌గ‌వారికీ వ‌ద్ద‌నిపించేలా వుంది. బాబు అంత‌రంగాన్ని ఆవిష్క‌రించ‌డానికి ఆయ‌న ఎల్లో మీడియా ఉన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీతో పొత్తు చ‌ర్చ‌ల నేప‌థ్యంలో బాబు అంత‌రంగాన్ని బాబు భ‌క్త ప‌త్రిక ఓ…

చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ క‌ష్టం ప‌గ‌వారికీ వ‌ద్ద‌నిపించేలా వుంది. బాబు అంత‌రంగాన్ని ఆవిష్క‌రించ‌డానికి ఆయ‌న ఎల్లో మీడియా ఉన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీతో పొత్తు చ‌ర్చ‌ల నేప‌థ్యంలో బాబు అంత‌రంగాన్ని బాబు భ‌క్త ప‌త్రిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే క‌లిగే న‌ష్టాల గురించి అమిత్‌షాకు చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు ఆ ప‌త్రిక రాసుకొచ్చింది.

‘మైనారిటీ వర్గాలు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చేవి. జగన్‌ పాలన చూసిన తర్వాత ఆ వర్గాల్లో గణనీయభాగం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మేం ఎన్డీయేలో చేరితే వారు మళ్లీ వైసీపీ వైపు మళ్లుతారేమోనన్న అనుమానాలు ఉన్నాయని చెప్పాను. వైసీపీ తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కేంద్రం అడ్డుకోలేదని.. దీనివల్ల రాష్ట్రం నష్టపోయిందన్న అభిప్రాయం కొన్నివర్గాల్లో ఉందని వివరించాను. నేనేమీ దాచుకోలేదు. అన్నీ వివరంగా చెప్పాను’ అని స‌ద‌రు ప‌త్రిక చంద్ర‌బాబు అంత‌రంగాన్ని ఆవిష్క‌రించింది.

ఈ క‌థ‌నం ప్ర‌కారం బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనార్టీల ఓట్లు పూర్తిగా వైసీపీకే. అలాగే విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోదీ స‌ర్కార్ సాయం చేయ‌క‌పోగా, తీవ్ర అన్యాయం చేసింద‌నే ఆగ్ర‌హం విద్యావంతులు, మేధావులు, ఆలోచ‌నాప‌రుల్లో ఉంద‌ని న‌మ్ముతున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్లంద‌రి ఓట్లు కూడా పోగొట్టుకోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యాన్ని అమిత్‌షా వ‌ద్ద చంద్ర‌బాబు వెల్ల‌డించిన‌ట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

బీజేపీతో ఏపీ ప్ర‌జానీకం అభిప్రాయాన్ని చెప్పి, పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామనే భ‌యాన్ని కూడా అమిత్‌షా వ‌ద్ద వెల్ల‌డించిన‌ట్టు చంద్ర‌బాబు, ఎల్లో మీడియా బ‌హిరంగంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రానున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని చంద్ర‌బాబు ముక్తాయింపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం క‌లిగే న‌ష్టం కంటికి క‌నిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం క‌లిగే లాభం కేవ‌లం ఊహాజ‌నితం, ఒక న‌మ్మ‌కం మాత్ర‌మే. ఎందుకంటే బీజేపీతో పొత్తు అనుభ‌వాల్ని 2014 నుంచి 19 వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌జానీకం చూసింది.

ఈ అనుభ‌వం రాష్ట్ర ప్ర‌జానీకానికి చేదు జ్ఞాప‌కాల్ని మిగిల్చింది. ఇప్పుడు చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ స్వార్థం కోసం ఏవేవో క‌థ‌లు చెప్పినా న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగాలేరు. న‌ష్ట‌పోతామ‌ని తెలిసి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి సిద్ధ‌మ‌వుతున్న చంద్ర‌బాబును చూస్తే జాలేస్తోంద‌న్న అభిప్రాయం క‌లుగుతోంది. రాజ‌కీయాల్లో ప‌గ‌వారికి కూడా ఈ దుస్థితి రాకూడ‌ద‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.