ఒక్క‌రిగా జ‌గ‌న్‌పై గెల‌వ‌లేక‌…!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడ‌డంపై ఆయ‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. పేర్ని మీడియాతో మాట్లాడుతూ అర్ధ‌రాత్రి…

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడ‌డంపై ఆయ‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. పేర్ని మీడియాతో మాట్లాడుతూ అర్ధ‌రాత్రి బీజేపీతో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం వెనుక ఆంత‌ర్యం ఏంటో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

2014లో బీజేపీ రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని బాబు అన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 2019 వ‌ర‌కూ బీజేపీతో క‌లిసి ఉండి, ఎన్నిక‌లు వ‌చ్చే స‌మ‌యానికి చివ‌ర్లో రాష్ట్రానికి మోదీ స‌ర్కార్ అన్యాయం చేసింద‌ని విమ‌ర్శించార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాని మోదీకి భార్యాపిల్ల‌లు, కుటుంబం లేద‌ని, అలాంటి వ్య‌క్తితో త‌న‌కు పోటీ ఏంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించార‌న్నారు. నాడు విమ‌ర్శించి, నేడు పొత్తు పెట్టుకునేందుకు ఎందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారో స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు.

కేవ‌లం త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు ఒక్క‌రిగా ఎదుర్కోలేకే, ప‌వ‌న్‌, బీజేపీని తోడు తెచ్చుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు. బీజేపీ, టీడీపీ చేసిన పాపాల‌కు చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెబుతారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ‌కు సిగ్గులేద‌ని, కేవ‌లం రాజ‌కీయ అవ‌స‌రాల కోసం, ఓట్ల కోసం వ‌స్తున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌ద‌లుచుకున్నారా? అంటూ బాబును ప్ర‌శ్న‌ల‌తో చిత‌క్కొట్టారు.

కొత్త‌గా రాష్ట్రానికి బీజేపీ ఏం న్యాయం చేసింద‌ని పొత్తు పెట్టుకుంటున్నార‌ని ఆయ‌న బాబును నిల‌దీశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చిందా?  రైల్వే జోన్ ఇచ్చిందా? పోర్టు నిర్మాణం పూర్తి చేసిందా?  క‌డ‌ప స్టీల్ ప్లాంట్ నిర్మించిందా?  పోల‌వ‌రం పూర్తి చేసి రాష్ట్రానికి అప్ప‌గించిందా? అని చంద్ర‌బాబును పేర్ని నాని నిల‌దీశారు. అధికారం కోసం చంద్ర‌బాబు ఏ గ‌డ్డైనా క‌రుస్తాడ‌ని పేర్ని చుర‌క‌లు అంటించారు.