ఇటీవల కాలంలో లోకేశ్ ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనడం బాగా తగ్గించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లోకేశ్ ఎక్కువగా పాల్గొనడం టీడీపీకి నష్టం తెస్తోందనే బలమైన అభిప్రాయం పార్టీలో వుంది. యువగళం పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయన తెర వెనుక రాజకీయాలకే పరిమితం అయ్యారు.
లోకేశ్ కనిపించకపోవడాన్ని వైసీపీ ఓ రేంజ్లో ఆడుకుంది. ఆయన్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తించారు. ఇప్పుడు మళ్లీ లోకేశ్ వార్తలకెక్కారు. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్రలో వెళ్లని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 11న శంఖారావాన్ని పూరించి, రోజుకు మూడు నియోజక వర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మొదటి విడతలో ఉత్తరాంధ్రలో లోకేశ్ పర్యటిస్తారు. అయితే లోకేశ్ పర్యటనపై టీడీపీ శ్రేణుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి.
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా టికెట్లపై ఇరుపార్టీల నేతల్లో ఆందోళన వుంది. ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతోంది. బీజేపీతో కూడా పొత్తు కుదుర్చుకోనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో తమకెక్కడ సీట్లు రావో అనే బెంగ పట్టుకుంది.
టికెట్లపై భరోసా లేని పరిస్థితిలో ఊరికే లోకేశ్, చంద్రబాబు సభలు, సమావేశాలకు జన సమీకరణ చేయడం అవసరమా? అనే ప్రశ్న ఎదురవుతోంది. భారీగా ఖర్చు పెట్టుకుని, అప్పులపాలైనా రాజకీయ భవిష్యత్‌పై భరోసా లేదనే ఆవేదన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే లోకేశ్ శంఖారావం కార్యక్రమంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.