బీజేపీతో మరో సారి జత కట్టడానికి చంద్రబాబు తన మార్క్ వ్యూహాన్ని రచించారు. ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటో పర్యవసానాలు ఎలా వుంటాయనే విషయమై ఆయన తర్జనభర్జన పడుతున్నారు. అలాగని ఆయన పొత్తు పెట్టుకోలేని అనివార్య పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చే సూచనలున్నాయి. మరోవైపు సీఎం జగన్‌ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని బాబు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకపోతే వైసీపీని ఎదుర్కోవడం అసాధ్యమని బాబు బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తులేకపోతే, భవిష్యత్‌లో ఏపీలో అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేమనే భావనలో చంద్రబాబు ఉన్నారు.
అందుకే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎన్డీఏలో చేరాల్సి వస్తోందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజధాని నిర్మించాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా , అలాగే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం వుందని చంద్రబాబు అంటున్నారు. ప్రజలు కూడా అదే కోణంలో ఆలోచించాలని తన మీడియా ద్వారా వ్యూహాత్మకంగా ప్రచారం మొదలు పెట్టారు.
ఇదే సందర్భంలో చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారని, అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇరుపార్టీలు భాగస్వాములుగా ఉన్నాయని, ఐదేళ్లలో రాష్ట్రానికి సాధించింది ఏంటి? అప్పుడు చేయలేనిది, ఇప్పుడు కొత్తగా చేయబోయేదేంటి? అని బాబును ఏపీ పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
నాడు నాలుగేళ్ల పాటు ఇటు రాష్ట్రంలో బాబు కేబినెట్‌లో బీజేపీ, అటు మోదీ కేబినెట్‌లో టీడీపీ సభ్యులు మంత్రి పదవులను వెలగబెట్టారు. రాష్ట్రానికి మోదీ సర్కార్ తీరని ద్రోహం చేసిందని ఇదే చంద్రబాబు దేశ వ్యాప్తంగా తిరిగి మరీ విమర్శించడాన్ని పౌర సమాజం గుర్తు చేస్తోంది.
తాజాగా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ, దానికి రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపెట్టడం ఏంటనే నిలదీత ఎదురవుతోంది. రాజధాని నిర్మాణానికి పిడికెడు మట్టి, చెంబు నీళ్లు తప్ప, ఏ సాయం చేయలేదని ప్రధాని మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఏ నమ్మకంతో మళ్లీ బీజేపీతో జత కట్టాలని అనుకుంటున్నారో సమాధానం ఇవ్వాల్సిన అవసరం వుంది.
కేవలం రాజకీయ స్వార్థంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెబితే, ఏ సమస్యా లేదని ప్రజానీకం హితవు చెబుతోంది.