కాంగ్రెస్ పార్టీ దృష్టి అంతా వైసీపీ మీదనే పెట్టినట్లుగా ఉంది. ఆ పార్టీలో అసంతృప్తులను మాజీలను చేరదీయాలని చూస్తోంది. ఈ నెల 11న ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా నర్శీపట్నం వస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కోసం కాంగ్రెస్ లో చేరికలు ఉండేలా పార్టీ నేతలు చూస్తున్నారు.
నర్శీపట్నంలో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బోళెం ముత్యాల పాప తిరిగి కాంగ్రెస్ లో చేరేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలెట్టారు. బోళెం ముత్యాల పాప కాంగ్రెస్ తరువాత ఒకసారి టీడీపీలో ఉన్నారు. మరోసారి వైసీపీలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.
తనకు వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని ఆమె ఆశ పెట్టుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కే మరోసారి టికెట్ ఆ పార్టీ ఖరారు చేసింది. దాంతో ఆమె పార్టీలో అసంతృప్తితో ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది.
అలాగని ఆమె టీడీపీలో చేరినా కూడా టికెట్ వచ్చే ప్రసక్తి లేదు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని ఆమె చూస్తున్నారు. దాంతో ఆమెను కాంగ్రెస్ నాయకులు సంప్రదిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరితే ఆమెకు టికెట్ ఇవ్వడం ఖాయం. మాజీ ఎమ్మెల్యేగా ఆమెకు కొంత క్యాడర్ ఉంటుందని అలా పార్టీ ఉనికి చాటుకోవచ్చు అన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది.
విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆమెకు నచ్చ చెప్పే పనిలో పడ్డారు. ఆమె పార్టీలో ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుందని కూడా అంటున్నారు. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే పార్టీ ఓట్లలో కొంత చీలిక వస్తుందని కూడా ఆలోచిస్తున్నారు. ఈసారి నర్శీపట్నంలో వైసీపీకి టీడీపీకి మధ్య హోరా హోరీగా పోరు సాగనుంది.
ప్రతీ ఒక్క ఓటూ కీలకం అవుతుంది. దాంతో బోళెం ముత్యాల పాపను కాంగ్రెస్ వైపు వెళ్ళనీయకుండా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయన్నది చూడాలి. ముత్యాలపాప కనుక కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటే నర్శీపట్నంలో ఎన్నికల పోరు రసకందాయంలో పడే అవకాశం ఉంది.