ఇష్టపడి వచ్చా.. మరొకరి కష్టాన్ని దోచుకోను

ఈగల్ సినిమా ప్రచారంలో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల్ని, సినీ కార్మికుల్ని ఆయన కించపరిచనట్టు కథనాలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు.…

ఈగల్ సినిమా ప్రచారంలో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల్ని, సినీ కార్మికుల్ని ఆయన కించపరిచనట్టు కథనాలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. తను కేవలం తన కంపెనీలో జరిగిన అవినీతిపై మాత్రమే స్పందించానని క్లారిటీ ఇచ్చారు.

“నా ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటోందో చెప్పాను.. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి చర్యలు చేపట్టాననే విషయాన్ని వెల్లడించాను. దీనికి భుజాలు తడుముకున్న కొందరు పరిశ్రమ వ్యక్తులు, నా వ్యాఖ్యలు వక్రీకరించి, నేనేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల, కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేనన్నాను.. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకర్ధం కాలేదు.”

తను ఎంతో ఇష్టపడి సినీరంగంలోకి వచ్చానని, మరొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు విశ్వప్రసాద్. తన కంపెనీలో అవినీతి జరిగిందని మరోసారి తెలిపిన ఈ నిర్మాత.. అవినీతిపరుల కుటుంబాల గురించి ఆలోచించి, వాళ్లపై లీగల్ చర్యలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. పైగా అది తన కంపెనీ అంతర్గత విషయమన్నారు.

తను యూనియన్ వర్కర్స్ కు వ్యతిరేకం కాదని, కార్మికుల కష్టాన్ని, తన డబ్బును కలిపి దోచుకుంటున్న వాళ్లకు మాత్రమే వ్యతిరేకమని ప్రకటించారు టీజీ విశ్వప్రసాద్.